AP Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. భీకరగాలులు..
AP Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం బలపడే అవకాశం ఉండటంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Published on- September 21, 2026 / 07:05 AM IST
AP Rains
AP Rain Alert : ఏపీలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుండటంతో వచ్చే వారం రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read : APPSC FSO Recruitment 2026 : ఏపీలో జాబ్స్ పడ్డాయ్.. డిగ్రీ పాసైనా వారికే ఛాన్స్.. అప్లయ్ చేసే డేట్ ఇదే..!
ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆదివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, సోమవారానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోనే వాయుగుండంగా మారనుంది. ఈనెల 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈనెల 23 ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బంగాళాఖాతంలో వాయుగుండం బలపడే అవకాశం ఉండటంతో సోమ, మంగళవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 23, 24 తేదీల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలతోపాటు భీకర గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కోస్తాంధ్ర తీరం వెంట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ (సోమవారం) అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని.. ఒకవేళ బయటకు వచ్చిన చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
