జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉంటారు. జనసేన పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన ఆయన.. ఆ తర్వాత జనసేనతో కాకుండా వైసీపీ వైపే మొగ్గు చూపిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన, వైసీపీపై రాపాక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాపాక చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
రాజోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందనీ, ఇప్పుడు మళ్లీ జగన్ హయాంలో అభివృద్ధి జరుగుతోందని రాపాక అన్నారు. పార్టీ అధినేతే విజయం సాధించలేదంటూ జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా రాపాక విమర్శలు చేయడం వెనుక కూడా ప్లాన్ ఉందట. తాను గెలిచిన పార్టీ నిలబడేది కాదని.. భవిష్యత్‌లో ఆ పార్టీకి మనుగడ కూడా ఉండదని జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆ ప్లాన్‌లో భాగమేనంటున్నారు.
2019 ఎన్నిల్లోనే వైసీపీ తరఫున టికెట్ కోసం ప్రయత్నించానని, టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా అంగీకరించారని చెప్పుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితిలో బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇచ్చారని, తాను ఖాళీగా కూర్చుని ఉంటే జనసేనకు సంబంధించిన కొందరు తన ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని కోరారని చెప్పడం సంచలనంగా మారింది. దీనివల్ల తానంతట తానుగా జనసేనలోకి వెళ్లలేదని వివరణ ఇస్తున్నట్టయ్యింది. తద్వారా తన ఇష్టమొచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పకనే చెబుతున్నారాయన.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్‌ను కలసినట్టు చెప్పారు రాపాక. ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వలేకపోయానని, కాబట్టి ఇప్పుడు కలసి పనిచేద్దామని జగన్ అన్నారనే విషయాన్ని రాపాక చెప్పారు. ఇక అప్పట్నుంచి రాపాక ప్రభుత్వంతో కలసి పని చేస్తున్నారట. రాపాక వ్యాఖ్యల వెనుక చాలా ఉద్దేశాలున్నాయని రాజోలులో టాక్. వాస్తవానికి రాజోలు వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావుది ఒక గ్రూపు.
గ్రూపు రాజకీయాలతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీలో తాను చేరితే ఏకఛత్రాధిపత్యం వహించవచ్చన్నది రాపాక ఆలోచనగా చెబుతున్నారు. ఆయన మాటల్లో కూడా ఈ ఉద్దేశం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం తాను వైసీపీ తరఫునే ఉన్నానని చెబుతూ రాజోలులో మూడు గ్రూపులు ఉన్నాయని, తనదో గ్రూపు అని రాపాక చెప్పడం వెనుక ఉద్దేశం అదేనని అంటున్నారు. అధినేత జగన్ ఒక్క మాట చెబితే అసలు గ్రూపులు, గొడవలు ఉండవని చెబుతున్నారు. అంతే కాదు.. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటయ్యేలా చేసుకోవచ్చన్నది ఆయన ప్లాన్ అని కార్యకర్తలు అంటున్నారు.
వైసీపీలో ఆయన అధికారికంగా చేరనప్పటికీ ఆ పార్టీతోనే అంటకాగుతున్నారు. తానైతే అందరినీ కలుపుకొని పోగలనని జగన్‌కు హింట్ ఇస్తున్నారు. తనకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీలో గ్రూపులే లేకుండా చేస్తానని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ ఏమంటారో? వైసీపీలోనే తాను ఉన్నానని బహిరంగంగా చెప్పడంతో జనసేన అధినేత పవన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.