సౌత్ కొరియా నుంచి ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు.. 10 నిమిషాల్లో ఫలితం

  • Publish Date - April 17, 2020 / 07:37 AM IST

కరోనా వైరస్ కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. కరోనా బాధితులను గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే ఇంటింటికి సర్వే
ద్వారా కరోనా బాధితులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు కరోనా ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిపోతుండటంతో సాధ్యమైనంత తొందరగా కరోనా బాధితులను గుర్తించేందుకు ఏపీ సర్కార్ ర్యాపిడ్ టెస్టు కిట్లను వినియోగించనుంది. 

అతి తక్కువ సమయంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించి క్వారంటైన్ తరలించాలంటే అత్యాధునిక టెస్టు కిట్లు అవసరం ఉంది. అందుకే దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించుకుంటోంది. ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ టెస్టు కిట్లు సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా బయల్దేరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

ఈ రోజు (శుక్రవారం) సాయంత్రానికి ఏపీకి ర్యాపిడ్ టెస్టు కిట్లు విమానంలో చేరుకునే అవకాశం ఉంది. ఈ కిట్లు చేరుకున్న అనంతరం క్యాంపు కార్యాలయంలో టెస్టు కిట్లను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ఈ ర్యాపిడ్ కిట్లను అధికారులు వినియోగించనున్నారు. 4 నుంచి 5 రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ ర్యాపిడ్ టెస్టు కిట్లను పంపించనున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యన్నారాయణ , సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.