Raptadu Incident : రాప్తాడు నిందితుడు హేమంత్‌కు సర్జరీ పూర్తి.. ఆరోగ్య పరిస్థితిపై కీలక విషయాలు వెల్లడించిన వైద్యులు
Raptadu Incident : రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ కు వైద్యులు శస్త్రచికిత్సను పూర్తి చేశారు. తాజాగా.. అతని ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించారు.
- Harish Thanniru
- Published on- November 3, 2026 / 09:40 AM IST
Accused Hemant
Raptadu Incident : శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడికి పాల్పడిన ఉన్మాది హేమంత్‌కు వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లేశ్వరి మాట్లాడుతూ.. హేమంత్ కాలును తొలగించినట్లు చెప్పారు.
Also Read : Pulivendula Municipality : హైకోర్టులో వైసీపీకి బిగ్ షాక్.. పులివెందుల కౌంటింగ్‌కు లైన్ క్లియర్
సోమవారం అర్ధరాత్రి తరువాత వైద్యులు హేమంత్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. మోకాలి పైవరకు కాలును తొలగించినట్లు మల్లీశ్వరి తెలిపారు. ఎడమ కాలికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడంతో ఆ కాలికి కూడా సర్జరీ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆపరేషన్ థియేటర్ నుంచి ఏఎంసీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలోని తరగతి గదిలోకి దూసుకెళ్లి రంపతో పదో తరగతి విద్యార్థినిపై దాడికి పాల్పడిన అనంతరం నిందితుడు హేమంత్ పారిపోయిన విషయం తెలిసిందే. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తుండగా.. ఆత్మకూరు అడవిలో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై దాడికి యత్నించాడు. దీంతో సీఐ వెంకటేశ్ చేయికి గాయాలయ్యాయి. లొంగిపోవాలని కోరినప్పటికీ వినకపోవటంతో పోలీసులు గాల్లోకి పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా నిందితుడు పోలీసులు మాట వినకుండా వారిపైనే దాడికి యత్నించాడు.
దీంతో పోలీసులు అతని కాళ్లపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు పరీక్షించి అతడి కుడి కాలుకు రక్తప్రసరణ జరగకపోవడంతో కుళ్లిపోయిందని, సర్జరీ చేసి కాలును తొలగించాలని నిర్ణయించారు. సోమవారం అర్ధరాత్రి సర్జరీ నిర్వహించి కుడి కాలును మోకాలి పైభాగం వరకు తొలగించారు.
