Gade Sai Krishna Case : సాయికృష్ణ కేసులో సంచలన మలుపు.. హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై సిట్ ఆరా..
Gade Sai Krishna Case : గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- June 26, 2026 / 12:00 PM IST
Gade Sai Krishna Lockup Death Case Updates SIT Investigation
Gade Sai Krishna Case: గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణది లాకప్ డెత్‌గా తేల్చిన అధికారులు.. సాయికృష్ణ మృతదేహం ఎక్కడ అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అదేసమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజులుగా ఇద్దరు కానిస్టేబుళ్లు విధులకు హాజరు కావడం లేదు. సిట్ అధికారుల పిలుపులకు కూడా హెడ్ కానిస్టేబుళ్లు స్పందించక పోవటం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఆరుగురు కానిస్టేబుళ్లు అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల పాత్రపై సిట్ విచారణ చేస్తోంది.
Also Read – Indian Citizenship : భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్న మాజీ సీఐ నాగరాజును ఇప్పటికే సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న నాగరాజును విచారిస్తున్నారు. అయితే, సాయికృష్ణ మృతి, మృతదేహం మాయం వ్యవహారంలో నాగరాజుకు సహకరించిన వారిపై సిట్ దృష్టి సారించింది. మృతదేహాన్ని ఏం చేశారు..? ఎక్కడ పడేశారనే వాటిపైనా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణలంక స్టేషన్ లో మొత్తం 60మంది సిబ్బంది ఉన్నారు. వీరందరినీ సిట్ ప్రశ్నిస్తోంది. మృతి, మృతదేహం మాయం వ్యవహారంలో ఏం జరిగింది? ఎవరి పాత్ర ఉంది? ఈ విషయం మీకెప్పుడు తెలిసింది? అని అందరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిలో కొందరి నుంచి ఆధారాలు దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. అయితే, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపైనా సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా వారు విధులకు హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సాయికృష్ణ అదృశ్యం ఘటనలో వారి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి అన్ని కోనాణాల్లో సిట్ అధికారులు విచారణను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
