Tammineni Sitaram : మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సహా కుటుంబ సభ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు
Tammineni Sitaram : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదైంది.
Tammineni Sitaram
Tammineni Sitaram : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌తో పాటు పలువురిపై శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదైంది. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం సమీపంలోని చాపురం సత్యసాయి నగర్లో ఉన్న సుమారు రూ.4కోట్ల విలువైన 900 గజాల భూమిని నకిలీ పత్రాల ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు అందింది. ఈ భూమి అందవరపు గోవిందరాజులుకు చెందినదిగా పేర్కొన్నారు. గోవిందరాజులు జీవించి ఉండగానే ఆయన పేరిట నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆమదాలవలస సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంపై గోవిందరాజుల అల్లుడు కనకలింగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌లపై కూడా కేసు నమోదు చేశారు. అలాగే అప్పటి ఆమదాలవలస సబ్-రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
