Gold Price Drop : పతనమవుతున్న పడిసి ధరలు.. కారణాలివే.. తులం గోల్డ్ రూ.లక్షకు చేరుతుందా.. నిపుణులు అంచనాలివే..
Gold Price Drop : బంగారం ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. వచ్చే దీపావళి నాటికి తులం బంగారం రూ.లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold Price Prediction
Gold Price Drop : బంగారం ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు బంగారం ధర దేశీయ మార్కెట్లో 25శాతం పడిపోయింది. ఇందులో దాదాపు మూడు శాతం గత వారం నష్టపోయింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10గ్రాముల మేలిమి పసిడి ధర రూ.1.45లక్షల వరకు పలుకుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే మరింత బోసిపోతోంది. ఈ పతనం ఇంతటితో ఆగకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారి అంచనా ప్రకారం.. ఈ ఏడాది దీపావళి నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
బంగారం ధరలు పతనం కావడానికి ప్రధాన కారణాలున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ పై అమెరికా మిసైళ్ల దాడితో విరుచుకుపడుతోంది.. ఇరాన్ సైతం గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు రానున్న రోజుల్లో తీవ్రమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మళ్లీ సెగలు పెరిగింది. గత కొద్దిరోజుల్లోనే బ్యారల్ ముడి చమురు ధర 14శాతం పెరిగిపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరులో జరిగే భేటీలో అమెరికా కేంద్ర బ్యాంక్.. ఫెడ్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు తప్పకుండా వడ్డీ రేట్లు పెంచుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పెట్టుబడి లాభాలకోసం చూస్తే ఇన్వెస్టర్లు పెద్దగా రాబడులు లేని బంగారాన్ని వదిలిపెట్టి.. చెల్లింపులకు ఢోకా లేకుండా అధిక వడ్డీ ఆదాయాన్ని ఇచ్చే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాల వైపు మళ్లుతారని భావిస్తున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లోనూ షార్ట్ సెల్లింగ్ పెరిగింది. స్వల్పకాలిక లాభాలకోసం బంగారం కొనుగోలు చేసిన మదుపరులు.. ధర ఇంకా ఎంత పడిపోతుందోననే ఆందోళనతో తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మకానికి పెడుతున్నారు. మార్కెట్ నిపుణుల ప్రకారం.. పశ్చిమాసియా తాజా సంక్షోభంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయని చెబుతున్నారు.
