రాజధాని గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రేపటి (జనవరి 3,2020) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు
రాజధాని గ్రామాల రైతులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రేపటి (జనవరి 3,2020) నుంచి సకల జనుల సమ్మె చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రాజధాని గ్రామాల రైతులు.. 29 గ్రామాల్లో బంద్ పాటించనున్నారు. సకల జనుల సమ్మెలో అన్ని వర్గాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాణిజ్య, వర్తక, విద్యా సంస్థలు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఉద్యోగులు కూడా సకలజనుల సమ్మెకు సహకరించాలని అమరావతి జేఏసీ విజ్ఞప్తి చేసింది.
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని స్థానిక రైతులు, ప్రజలు 16 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్న రైతులు.. రేపటి(జనవరి 3,2020) నుంచి సకలజనుల సమ్మెకు సిద్దమయ్యారు. తుళ్లూరులో జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడి దీనిపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి సకలజనుల సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. నిత్యావసరాలు, ఎమర్జెన్సీ(ఆసుపత్రులు, మందుల షాపులు, పాల సరఫరా) మినహా మిగతా కార్యాలయాలన్నీ మూసివేయాలని నిర్ణయించారు.
శుక్రవారం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో.. సకలజనుల సమ్మెతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అలాగే కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లకు కూడా లేఖలు రాస్తున్నారు. అమరావతి రాజధాని అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని చూస్తున్నారు.
రాజధాని మార్పుపై ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెండో దశ ఉద్యమానికి వెళ్తున్నట్టు తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల్లో బంద్ చేపడతామన్నారు.
శుక్రవారం(జనవరి 3,2020) బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్ట్ రాబోతుంది. ఈ కమిటీ కూడా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. బీసీజే నివేదిక తర్వాత హైపవర్ కమిటీ కూడా రిపోర్ట్ అందజేయనుంది. కమిటీల నివేదికపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కాగా, రిపోర్టుల సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ నేతల మాటలు చూస్తుంటే… విశాఖలోనే రాజధాని ఏర్పాటు చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. మరి సకలజనుల సమ్మె.. జగన్ ప్రభుత్వంపై ఏ మేరకు ఒత్తిడి పెంచుతుందో చూడాలి.