త్వరలో ఏపీలో కొత్త ఇసుక విధానం: జగన్ ఆదేశాలు.. ప్రభుత్వం కసరత్తు

  • Publish Date - August 26, 2019 / 02:55 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త విధానం అమలులోకి తీసుకుని రాబోతున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా 102 ఇసుక రీచ్‌లను 47 షెడ్యూళ్లుగా విభజించి(ఒక్కో దానిలో రెండు మూడు రీచ్‌లు ఉండేలా) స్టాక్‌ యార్డులకు ఇసుక చేర వేసేందుకు జిల్లా యూనిట్‌గా టెండర్లు, రివర్స్‌ టెండర్లు నిర్వహించింది. సింగిల్‌ బిడ్లు వచ్చిన వాటిని రద్దు చేసి వీటితో కలిపి అసలు బిడ్లు రాని వాటికి తిరిగి టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు విడుదల చేసింది ప్రభుత్వం.

పారదర్శకత, ప్రజలకు సరసమైన ధరకు ఇసుక సరఫరా, ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం సర్కారుకు రాబడి లక్ష్యాలుగా ఇసుక విషయంలో కొత్త విధానం కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. రాష్ట్రంలోని అన్ని స్టాక్‌ యార్డులలో నిండుగా ఇసుక నింపాలని, ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి కోరిన చోటుకు ఇసుక చేరవేసేందుకు ఏర్పాట్లు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

ప్రభుత్వ కొత్త విధానం అమలులోకి వచ్చాక ఎవరు ఇసుక బుక్‌ చేసుకున్నా తక్షణమే సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో టన్ను ఇసుక కూడా దుర్వినియోగం కావడానికి వీల్లేదని సరసమైన ధరలకు ప్రజలకు ఇసుక అందించాలని, ఇసుక మాఫియా గ్యాంగుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతం గుర్తించిన 102 ఇసుక రీచ్‌లతోపాటు కొత్త రీచ్‌లను గుర్తించి అవసరమైన చట్టబద్ధమైన అనుమతులు తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది.

ఇప్పటికే అనుమతులు ఉన్న రీచ్‌లలో కొన్ని చోట్ల నదులు ప్రవహిస్తుండడంతో ఇసుక తీయలేని పరిస్థితి ఉంది. అందువల్ల మిగిలిన చోట్ల ఇసుకను స్టాక్‌ యార్డులకు చేర్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం వాహనాలకు జీపీఎస్‌ యంత్రాలు వినియోగించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అలాగే స్టాక్‌ యార్డులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.