YS Jagan: సింగయ్య మృతి కేసు.. హైకోర్టుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి .. రేపు విచారణ

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

YS Jagan

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో జగన్‌తోపాటు ఆయన డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనిపై కేసులు నమోదయ్యాయి. అయితే, తనపై పెట్టిన కేసు తొలగించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో బుధవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తోపాటు వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

సింగయ్య మృతి కేసులో జగన్ మోహన్ రెడ్డిని ఏ2గా చేర్చారు. ఈ క్రమంలో మంగళవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంకు వెళ్లిన పోలీసులు పార్టీ కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అదేవిధంగా సత్తెనపల్లిలో జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ కారును విచారణ నిమిత్తం నల్లపాడు పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

వైసీపీ శ్రేణులు మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేయడం.. గురువారం ఆ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది.