సూర్యగ్రహణం కారణంతో తెలుగు రాష్ట్రాల్లోని మూతపడ్డ ప్రధాన ఆలయాలు తెరుచుకున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లికార్జున ఆలయం, యాదాద్రి నర్సింహస్వామి ఆలయంతో.. పాటు ఇతర ఆలయాలు 2019, డిసెంబర్ 26వ తేదీ గురువారం ఉదయం మూతపడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు తలుపులు మూసి ఉంచిన అర్చకులు.. ఆలయ సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు అనుమతినిచ్చారు.
మరోవైపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తిలో ముక్కంటికి ప్రత్యేక గ్రహణకాల అభిషేకాలు జరిగాయి. ఉదయం ఐదు గంటలకు గ్రహణ కాల ప్రారంభ అభిషేకం చేశారు పూజారులు. సాధారణంగా జరిగే మూడు కాలాభిషేకాలకు భిన్నంగా ఐదు కాలాభిషేకాలు చేస్తున్నారు. గ్రహణ సమయాన్ని సర్పకాల, మధ్యకాల, మోక్ష కాలాలుగా పరిగణిస్తూ మూడు అభిషేకాలు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపడతారు.
ఈ రోజు ఉదయం ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. పలుదేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఉదయం 8 గంటల 8నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం.. తెలుగురాష్ట్రాల్లో 11గంటల 10 నిమిషాలకు ముగిసింది. అయితే ఉదయం 9గంటల 30 నిమిషాలకే 75 శాతం సూర్యుడిని చంద్రుడు కప్పేయడంతో.. సూర్యుడు నెలవంకలా మారిపోయాడు. దీంతో ఉదయం సమయంలోనే వాతావరణం సాయంత్రంలా మారిపోయింది.
కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. కోయంబత్తూర్, పాలక్కాడ్, మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షకులను ఆకట్టుకుంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో సూర్యగ్రహణ ప్రభావం అంతగా లేదు.
భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్, సౌదీ, సింగపూర్ దేశాల్లో సూర్యగ్రహణం కనిపించింది దుబాయ్‌లో మాత్రం గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్‌గా సూర్యగ్రహణం కనువిందు చేసింది. ఆ సమయంలో చందమామ చుట్టూ సూర్యజ్వాలలు కనిపించాయి.
Read More : రాజధాని రగడ : రిలే దీక్షలు..ఆందోళనలు..నిరసనలు