Srusti Fertility Centre Case
Srusti Fertility Centre Case: సరోగసీ ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుంది. సికింద్రాబాద్ లోనే కాదు.. విశాఖపట్టణ, విజయవాడలో సృష్టి అక్రమాలు కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూస్తోంది. దీంతో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతోపాటు పలువురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం విషయం తెలిసిందే.
రాత్రికి రాత్రే బోర్డులు తొలగింపు..
విజయవాడలోనూ బెంజ్ సర్కిల్ సమీపంలో యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఈ ఆస్పత్రిపై గతంలో పలు సార్లు పోలీసు కేసులు నమోదయ్యాయి. పలు సందర్భాల్లో లైసెన్సునుసైతం రద్దు చేసినట్లు తెలిసింది. అయితే, వేరేవారి పేరుపై ఈ సెంటర్‌ను నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ కరుణ పేరుపై ఈ సెంటర్ నడుస్తున్నట్లు గుర్తించారు. ఇదిలాఉంటే.. తాజా పరిణామాలతో రాత్రికి రాత్రే సృష్టి బోర్డులను యాజమాన్యం తొలగించింది. రోడ్డుపై, ఆస్పత్రి ముందు, ఆస్పత్రిపైన ఉన్న సృష్టి బోర్డులను తొలగించారు. ఆస్పత్రి సెల్లార్ లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. డాక్టర్ కరుణ ఆస్పత్రికి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోమవారం ఆస్పత్రికి సిబ్బంది ఎవరూ రాలేదు. మరోవైపు.. ల్యాబ్ ఇంచార్జి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వైద్య సిబ్బంది తనిఖీలు..
విజయవాడ ఆస్పత్రిలో డీఎంఅండ్ హెచ్ఓ సుహాసిని, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రికి సంబంధించిన డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. ఆస్పత్రికి రిసెప్షనిస్ట్ మినహా ఎవరూ రాకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని, వైద్యులను పిలవాలని అధికారులు ఆదేశించారు. అయితే, తనిఖీల అనంతరం ఆసుపత్రి అనుమతులు సరిగా ఉన్నాయని డీఎంహెచ్‌వో తెలిపారు.
తనిఖీల సమయంలో సృష్టి పేరుతో ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ, ఎలాంటి బోర్డులు కానీ లేవని వైద్య అధికారులు తెలిపారు. యూనివర్శల్ హెల్త్ కేర్ పేరుతోనే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది. అయితే, డాక్టర్ నమ్రత పేరుతో ఆస్పత్రి నిర్వహణ ఉందని, ఈ విషయాలన్నింటిని ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందజేస్తామని వైద్య అధికారులు తెలిపారు. ఇక్కడ నడుస్తున్న యూనివర్శల్ హెల్త్ కేర్ పై ఎలాంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదని చెప్పారు.