Social Media Misuse : సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే.. ఇక తప్పించుకోలేరు..!

Social Media Misuse : ఆర్థిక బలోపేతం, సంక్షేమం, అభివృద్ధితో పాటు సోషల్ మీడియా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్, టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Social Media Misuse

Social Media Misuse : రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ఏపీ కేబినెట్‌లో విస్తృత చర్చ జరిగినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. సంక్షేమ పథకాల నిరంతర అమలుకు ఆర్థికంగా బలమైన రాష్ట్రం అవసరమని కేబినెట్ అభిప్రాయపడిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్, మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.

సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించే విధానాలపై ప్రతి కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక పటిష్టతే ప్రభుత్వ ప్రధాన అజెండాగా మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.

సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన :
సమాజానికి అవసరమైన సోషల్ మీడియా ప్రస్తుతం తప్పుదారి పడుతోందని, కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టాన్ని స్థాయికి చేరుతోందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల ఆలోచనా విధానం, పాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని సమావేశంలో చర్చించారు. ప్రపంచంలోని పలు దేశాలు సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేస్తున్న అంశంపై డీజీపీ కేబినెట్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు.

సంప్రదాయ మీడియా వంటి జవాబుదారీతనం, నైతిక విలువలు సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో లేవని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం, అసత్య సమాచారం వ్యాప్తి పెరుగుతోందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, దుష్ప్రచారం కోసం కొందరు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించింది.

చట్టాల బలోపేతానికి చర్యలు :
సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు ఏపీ కేబినెట్‌ సమావేశంలో సమగ్ర స్థాయి నివేదికను అందించారు. ఈ సందర్భంగా విదేశాల్లో అమలయ్యే సోషల్ మీడియా కంట్రోలింగ్ చట్టాలు, భారత ఐటీ చట్టంలోని లోపాలపై చర్చ జరిపారు.

Read Also : Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై మరో ఫిర్యాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు కొత్త చిక్కులు తెస్తాయా?

మహిళలు, బాలికలను కించపరిచే పోస్టులు, వ్యక్తిత్వ హననం, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఎం స్పష్టం చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టాలను మరింత బలోపేతం చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు :
సోషల్ మీడియా దుర్వినియోగ ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు.. ఇలాంటి సమస్యలపై వేగంగా స్పందించేందుకు రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

విద్వేష ప్రచారం, వ్యక్తిత్వ హననం చేసే సోషల్ మీడియా ఖాతాలను గుర్తించేందుకు అడ్వాన్స్ ఫోరెన్సిక్ టూల్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు.

సైబర్ నేరాల దర్యాప్తులో నైపుణ్యం కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా నియమించాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. దేశ, విదేశాల్లో సోషల్ మీడియా నియంత్రణకు అమలయ్యే ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GOM) పనిచేయాలని నిర్ణయించారు. ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు డిజిటల్ వేదికల బాధ్యతాయుత వినియోగంపై కూడా ప్రభుత్వ దృష్టిసారించనుందని మంత్రి పార్థసారథి తెలిపారు.