Land Pooling Case: సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట.. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు డిస్మిస్
అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో(Land Pooling Case) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
- V Santhosh Kumar
- Published on- August 14, 2026 / 02:55 PM IST
Supreme court dismissed chandrababu naidu amaravati land pooling case
- సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట
- ల్యాండ్ పూలింగ్ కేసు రద్దు
- రాజకీయ వ్యాజ్యాలపై సీజేఐ ఆగ్రహం
Land Pooling Case: అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి పి. నారాయణలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో సీఐడీ నమోదు చేసిన క్రిమినల్ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చి న తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పూర్తిగా తిరస్కరించింది.
విధానపరమైన నిర్ణయాలపై ఎఫ్‌ఐఆర్ చెల్లదన్న కోర్టు:
2021లో సీఐడీ నమోదు చేసిన ఈ కేసును(Land Pooling Case) పరిశీలించిన ఏపీ హైకోర్టు, కేవలం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా జీవోలు జారీ చేయడాన్ని క్రిమినల్ కుట్రగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ జూలై 15న కేసును కొట్టివేసింది. దీనిపై దాఖలైన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల్లో తప్పులు ఏమీ లేవని పేర్కొంది. అంతేకాకుండా ఈ తీర్పు కేవలం ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికే పరిమితమని, ఇతర సంబంధిత కేసులకు ఇది వర్తించదని, వాటిని సొంత మెరిట్స్ ఆధారంగానే విచారించాలని అత్యున్నత ధర్మాసనం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
రాజకీయ వేదికలుగా కోర్టులను మార్చవద్దని హితవు:
విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ రాజకీయ నేతల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల హక్కులు, వారి ప్రయోజనాల పరిరక్షణ విషయంలో న్యాయస్థానాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని హామీ ఇచ్చారు. అయితే, రాజకీయ నాయకులు తమ అంతర్గత, పార్టీల మధ్య ఉండే రాజకీయ పోరాటాలను కోర్టుల వేదికగా తీసుకురావడం సరికాదని హితవు పలికారు. రాజకీయ విభేదాలను న్యాయపరమైన వివాదాలుగా మార్చే ధోరణిని మానుకోవాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
