Supreme-Court
Supreme Court serious on ap government: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చెయ్యడంపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశం ఇచ్చింది.
ఎప్పటిలోగా విచారణ పూర్తి చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణ పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం కోరింది ప్రభుత్వం. అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పుడు విచారణకు అంత సమయం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. రోజువారి విచారణ చేపట్టి ఏప్రిల్ 8లోగా శాఖాపరమైన దర్యాఫ్తు పూర్తి చేయాలని, ఏప్రిల్ 30లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 3కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
ఏడాదికిపైగా సస్పెన్షన్‌ను పొడిగించడాన్ని సవాల్ చేస్తూ ఇటీవల వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అవినీతి ఆరోపణలు లేనందున సస్పెన్షన్‌ను రివ్యూ కమిటీ ఏడాదికిపైగా పొడిగించడానికి వీల్లేదని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌లో తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది చందర్ ఉదయ్‌సింగ్, ఏబీ వెంకటేశ్వరరావు తరఫున ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారని, భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుపై గతంలోనే జగన్ సర్కార్ సస్పెన్షన్ విధించింది. అనంతరం ఆయనపై సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ పదవి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పించింది. 2017-18 నాటి కొనుగోళ్ల వ్యవహారాన్ని అందుకు కారణంగా చూపింది.
భద్రతా పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇజ్రాయెల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ కు దక్కేలా చేశారని, ఆ సంస్థకు తన కుమారుడు చేతన్ సాయికృష్ణ భారత్ లో ప్రతినిధిగా ఉన్న విషయం దాచారని ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడికి చెందిన ఆకాశం అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ కు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారని, అందుకోసం టెండర్ల ప్రక్రియను మార్చివేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటం చేస్తున్నారు.