×
Ad

TDP : పద్దతి మార్చుకోవాలి.. ఇదే ఫైనల్ ఛాన్స్.. కొలికపూడి శ్రీనివాస్‌తో పల్లా కీలక భేటీ.. తీవ్ర హెచ్చరికలు..

TDP : కొలికపూడి వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాస్ ఆయనతో భేటీ అయ్యారు.

Kolikapudi Srinivasa Rao, Palla Srinivas

TDP : తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సమావేశం అయ్యారు. అసెంబ్లీ లాబీలో కొలికపూడితో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో కొలికపూడికి పల్లా తీవ్ర హెచ్చరికలు చేశారు.

Also Read : Andhrapradesh : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన బాలకృష్ణ, నాగబాబు.. ఫొటో గ్యాలరీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన వాట్సాప్ స్టేటస్ లో రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. తాను మూడ్రోజులపాటు పలు గ్రామాల్లో పర్యటించానని.. రహదారుల్లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దు:ఖం ఆపుకోలేకపోయానంటూ ఆ స్టేటస్ లో పేర్కొన్నారు. దీంతో కొలికపూడి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి స్టేటస్ లు పెట్టడంతో చర్చకు దారితీసింది. దీంతో కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది.

కొలికపూడి వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాస్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశాలుగా కొలికపూడికి పల్లా తీవ్ర హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయాన్ని గుర్తించి ప్రవర్తించాలని హితవు పలికారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరని కొలికపూడికి పల్లా స్పష్టం చేసినట్లు తెలిసింది.

గతంలోనూ కొలికపూడి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత విషయాలను గుర్తుచేస్తూ.. తప్పుల మీద తప్పులు చేస్తే పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించడం మానేస్తుందని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వాట్సాప్ లో పిచ్చి స్టేటస్ లతో ఎవరిపై పోరాటం చేస్తున్నారని నిలదీశారు. కొలికపూడి స్పందిస్తూ.. అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరుగుతున్నాయని, సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కొలికపూడి పేర్కొనట్లు తెలిసింది.