TDP: ఇప్పుడు టీడీపీ యంగ్ లీడర్లు, సీనియర్ల ప్రయత్నాలు అన్నీ దీనిపైనే..

జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వారికి భవిష్యత్తులో వచ్చే పదవులలో వెయిటేజీ ఉంటుంది. పార్టీ అధినేత ఆ విధమైన సంకేతాలు కూడా ఇచ్చారు.

CM Chandrababu Naidu - TDP

TDP: తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా అధ్యక్ష ఎన్నికల కసరత్తు జరుగుతోంది. పార్టీ హైకమాండ్ నియమించిన త్రిసభ్య కమిటీలు ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, సీనియర్‌ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్నాయి. రెండు జిల్లాలకు అధ్యక్ష రేసులో ఏడుగురి పేర్లను త్రిసభ్య కమిటీకి చేరాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థులు స్వీప్ చేశారు. ఇదే ఊపు మునముందు కొనసాగాలంటే గట్టి నాయకులకు జిల్లా పగ్గాలు అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేలా జిల్లా బాస్‌లను నియమించాలని త్రిసభ్య కమిటీకి బాధ్యత అప్పగించారు పార్టీ పెద్దలు.

Also Read: BRS: బీఆర్ఎస్‌లో వరుసగా చేరికలు.. ఎందుకంటే?

ఎన్టీఆర్ జిల్లా విషయానికొస్తే బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా, గన్నే నారాయణ ప్రసాద్‌, బొమ్మసాని సుబ్బారావు రేసులో ఉన్నారు. వీరిలో బుద్ధ వెంకన్న, నాగుల్ మీరాలు చాలా సీనియర్ నేతలు. వీరిద్దరూ బలహీనవర్గాలకు చెందినవారు. గన్నే నారాయణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఎన్టీఆర్ జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీలో పయ్యావుల కేశవ్‌, బీటీ నాయుడులు సభ్యులుగా ఉన్నారు.

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా స్వీకరించారు. బలహీనవర్గాల నుంచి పూర్వ అర్బన్‌ అధ్యక్షుడిగా పనిచేసిన బుద్ధా వెంకన్నతో పాటు దూదేకుల సామాజిక వర్గం నుంచి నాగుల్‌మీరాల పేర్లు ప్రధానంగా వచ్చాయి. నాగుల్‌ మీరాను ఇప్పటికే నూర్‌ బాషా, దూదేకుల సంక్షేమ శాఖ చైర్మన్‌గా నియమించారు. ఇక గన్నే నారాయణ ప్రసాద్ అర్బన్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు. బొమ్మసాని సుబ్బారావు పార్టీలో సీనియర్‌ నాయకుడు. గతంలో మైలవరం సీటు రేసులో కూడా నిలిచారు.

కొనకళ్ల నారాయణవైపే చాలామంది నేతల మొగ్గు

ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొనకళ్ల నారాయణవైపే చాలామంది నేతలు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు నేతలు మాత్రం సీనియర్ నేతగా ఉన్న గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి పదవులు ఆయనకు లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలున్నాయి.

కోనేరు నాగేంద్రకుమార్ అనే నేత పేరును కూడా పలువురు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అయితే యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్‌కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కృష్ణాజిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీలో కాలువ శ్రీనివాసులు, దామచర్ల సత్య, పి.గోవింద్‌లు సభ్యలుగా ఉండి..నాయకుల అభిప్రాయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కుల సమీకరణల కంటే.. సమర్థవంతమైన నాయకులకే పగ్గాలివ్వాలనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.

కొనకళ్ల నారాయణ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉన్నారు. నామినేటెడ్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోతే కృష్ణాజిల్లా అధ్యక్ష పదవి గొట్టిపాటికి దక్కే అవకాశం ఉంది. మరోవైపు కాపు సామాజిక వర్గ కోటాలో బూరగడ్డ వేదవ్యాస్ రేసులో ఉన్నారు.

జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వారికి భవిష్యత్తులో వచ్చే పదవులలో వెయిటేజీ ఉంటుంది. పార్టీ అధినేత ఆ విధమైన సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలు అంతా జిల్లా బాధ్యతలు చేపట్టి తర్వాత మంచి పదవిని దక్కించుకునే ఆలోచన ఉన్నారు. మరి కొందరు చట్టసభలపై కన్నేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏదైనా అసెంబ్లీ సీటు సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. అయితే త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోంది పార్టీ అధిష్టానం.