కరణం బలరాం అడుగు ఎటు? : వైసీపీ, బీజేపీ నుంచి ఆఫర్లు!

  • Publish Date - December 17, 2019 / 03:00 PM IST

పాలిటిక్స్‌లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ. అనగానే టక్కున గుర్తొచ్చేది చంద్రబాబు కదా. ఇదే మాట ప్రకాశం జిల్లాకెళ్లి అనండి.. కరణం బలరాం పేరే వినిపిస్తుంది. అదేంటో గానీ.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో.. ఆయనకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఆయన చిరకాల కల ఇంకా నెరవేరలేదు. తీవ్రమైన పొలిటికల్ ప్రెజర్ ఫీలవుతున్నారు. ఇక ఇప్పుడు.. డెసిషన్ తీసుకునే టైమొచ్చింది. ఆయన తీసుకోబోయే నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించింది మాత్రం కాదు. 

మరెవరి కోసం? అంటే.. ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసమని అంటున్నారు. కొన్నాళ్లుగా టీడీపీలో కరణం బలరాం అసంతృప్తి ఫీలవుతున్నట్టుగా కనిపిస్తున్నారు. భవిష్యత్తులో బలరాం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బలరాంపై రోజురోజుకీ పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిళ్లతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుబోతున్నారనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. మరోవైపు బలరాంకు వైసీపీ, బీజేపీ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి బలరాం రిటైరవుతారా? లేదంటే కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం ఆయన ఏం చేయబోతున్నారు? అనేది ప్రశ్న. 

అందుకే మంత్రి కాలేకపోయారా? :
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు.. చంద్రబాబు, కరణం బలరామే అందరికంటే సీనియర్లు. కరణంది కూడా చంద్రబాబులానే 40 ఇయర్స్ ఇండస్ట్రీ. బలరాం.. చంద్రబాబుకు సమకాలీకుడు కూడా. కాకపోతే.. ఆయనకు కలిసొచ్చి సీఎం అయ్యారు. ఈయకు లక్ లేక.. మినిస్టర్ కూడా కాలేకపోయారు. ఓ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న కరణం బలరాం పొలిటికల్ జర్నీ.. ఎందుకు ఎమ్మెల్యే పదవి దాటలేదన్నదే బిగ్ సస్పెన్స్‌గా మారింది. 1978లో తనకొచ్చిన మంత్రి పదవి అవకాశాన్ని.. తన మిత్రుడు చంద్రబాబు కోసం త్యాగం చేశారని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. 

అలా.. ఆ రోజు కోల్పోయిన మంత్రి పదవి.. ఇప్పటికీ దక్కలేదని ఆయన అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. కరణం బలరాం అసెంబ్లీకి ఎన్నికవడం ఇది ఐదోసారి. ఒకసారి ఎంపీగానూ పనిచేశారు. అయినప్పటికీ.. కరణం బలరాం ఇప్పటివరకు మంత్రి కాకపోవడం వెనక.. ఓ లాజికల్ రీజన్ ఉంది. బలరాం గెలిచినప్పుడు.. టీడీపీ అధికారంలో ఉండటం లేదు. పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు.. ఆయన గెలవడం లేదు. ఈ పరిణామాలతో.. కరణం బలరాంకు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా.. మంత్రిపదవి మాత్రం అందని ద్రాక్షలానే మారింది. 

కరణం బలరాంకు.. చంద్రబాబుకు మధ్య మంచి స్నేహం ఉంది. వైఎస్ హయాంలో… ఆ రోజుల్లో.. చంద్రబాబు కోసం నాటి స్పీకర్ సురేశ్ రెడ్డితోనూ గొడవపడ్డారు. ఏకంగా స్పీకర్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 6 నెలల పాటు బలరాంని సభ నుంచి సస్పెండ్ చేశారు. అలాంటి కరణం బలరాం.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుంటే.. ఎందుకు స్పందించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. బలరాం కావాలనే పట్టించుకోవట్లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

టీడీపీలో అసంతృప్తే కారణమా? :
కరణం బలరాం కొన్నాళ్లుగా టీడీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఐదేళ్లు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తమ కుటుంబాన్ని అవమానించారనే భావనలో ఉన్నారట. ఇది మనసులో పెట్టుకొనే.. అసెంబ్లీ సమావేశాల్లో.. అంటీ ముట్టనట్టు ఉంటున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గొట్టిపాటి రవి కోసం తమను దూరంగా పెట్టారని.. ఇప్పుడు రవి పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని కరణం అనుచరులు దెప్పిపొడుస్తున్నారంట. 

కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమేనా? :
మరోవైపు కరణం బలరాంలో ఈ అసంతృప్తిని గమనించిన వైసీపీ.. తమ దూతలను చర్చలకోసం పంపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. మంత్రి బాలినేని ఆయనతో చర్చలు జరిపినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బలరాం కుమారుడు వెంకటేశ్ రాజకీయ భవిష్యత్తుపై.. వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు అంతా చెప్పుకుంటున్నారు. ఈ మేరకు.. బలరాం కుమారుడు వెంకటేశ్‌కు.. జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్లు అంతా చెప్పుకుంటున్నారు. మరో పక్క.. బంధువైన సుజనా చౌదరి కూడా.. బీజేపీలోకి రావాలంటూ కరణంపై ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న కరణం బలరాం.. తన కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఎలాంటి అడుగు వేస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల సమయానికి.. తాను పాలిటిక్స్ నుంచి రిటైరైపోయి.. కొడుకును రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. బలరాం కుటుంబం వైసీపీ వైపు చూస్తోందన్న వార్తలు కూడా జిల్లాలో హల్‌చల్ చేస్తున్నాయి.

కొడుకు వైసీపీలోకి పంపిస్తారా.. లేక.. టీడీపీలోనే ఉంటారా అన్న దానిపై.. బలరాం అభిమానులు, అనుచరులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అందరూ అనకున్నట్టుగా బలరాం తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

ట్రెండింగ్ వార్తలు