కడప గడపలో ‘మహానాడు’ షురూ.. తొలిరోజు కార్యక్రమాలు ఇవే.. నోరూరించే వంటకాలు..

కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండగ అంగరంగవైభవంగా ప్రారంభమైంది.

TDP Mahanadu 2025

TDP Mahanadu 2025: కడప గడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పసుపు పండగ అంగరంగవైభవంగా ప్రారంభమైంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత.. అదికూడా వైసీపీకి కంచుకోటగా పేరున్న కడప జిల్లాలో మహానాడు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

కర్నూలు-కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని రింగురోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చివరి రోజు భారీ బహిరంగకు ఏర్పాట్లు చేశారు. మహానాడు సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. మొదటి రెండు రోజులూ ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహణలో భాగంగా వాహనాల పార్కింగ్ కు 450 ఎకరాలు కేటాయించారు.

పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రస్తానం, సాధించిన విజయాలు ప్రతిబింబించేలా ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అన్ని వసతులతో వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. 15 పడకలతో పెట్టిన మెడికల్ క్యాంప్ లో ఐసీయూ సహా అత్యవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

నోరూరించే వంటకాలు..
మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొదటి రెండు రోజులు రెండు లక్షల మందికిపైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మూడోరోజు బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా వంటకాలను తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

ఉదయం టూటీప్రూటీ కేసరి, పొంగలి, ఇండ్లీ, టమాటా బాత్, కాఫీ, టీ అందిస్తారు. మధ్యాహ్నం మాంసాహారంలో గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్‌ చికెన్‌కర్రీ, ఎగ్‌ రోస్ట్, రోటి పచ్చడి, తెల్లన్నం, ప్లెయిన్‌ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు. శాఖాహారంలో గోంగూర పూల్‌ మఖానా, ప్లెయిన్‌ బిర్యానీ, టమాటా పప్పు, తెల్లన్నం, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం పూట స్నాక్స్ లో కాఫీ, టీతోపాటు కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు అందిస్తారు. రాత్రి సమయంలో రైస్ తోపాటు వంకాయ బఠాణీ, అలూ ఫ్రై, పెసరపప్పు, చారు, రోటి పచ్చడి, పెరుగు అందించనున్నారు.

తొలి రోజు (మంగళవారం) ఇలా..
♦ ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు.
♦ 10 నుంచి 10.45 గంటల వరకు ఫొటో ప్రదర్శన, రక్తనదాన శిబిరం ప్రారంభం.
♦ 10.45 గంటలకు ప్రతినిధుల సభను పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వనలతో ప్రారంభిస్తారు. అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాపం తెలుపుతారు. ఆ తరువాత పార్టీ కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు.
♦ 11.30 నుంచి 11.45 గంటల వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉపాధ్యక్షుడి ప్రసంగాలు.
♦ 11.45 నుంచి 11.50 గంటల వరకు జమా ఖర్చుల నివేదిక.
♦ 11.50 గంటల నుంచి 12.45 గంటల వరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగం.
♦ మధ్యాహ్నం 12.45 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ.
♦ మధ్యాహ్నం ఒంటి గంటకు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్.
♦ 2గంటల నుంచి 3 గంటల మధ్య ‘కార్యకర్తే అధినేత’ అంశంపై చర్చ.
♦ 3.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు యువగళం పేరిట యువత సంక్షేమం, ఉపాధి అవకాశాలు, ప్రజాపాలనలో సాంకేతికత, వాట్సప్ గవర్నెన్స్ అంశాలపై చర్చ.
♦ సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, మౌలిక సదుపాయాల కల్పనలపై చర్చ ఉంటుంది.