మహానాడు వేళ బాబుకు షాక్ : టీడీపీ నుంచి వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్

  • Publish Date - May 26, 2020 / 09:38 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ఎండలతో పాటు రాజకీయాలు మళ్లీ వేడేక్కాయి. ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలయ్యింది. ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడే టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతోంది. టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు లాగేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు?  టీడీపీకి ఉన్న ప్రతిపక్ష హోదాను పోగొట్టటానికే వైసీపీ ఆ ముగ్గురికి వల వేసిందా అనేది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. 

మే 28 గురువారం నాడు టీడీపీ మహానాడును నిర్వహించుకోబోతోంది. టీడీపీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిధ్దంగా ఉన్నారనే వార్తలు ప్రచారం లోకి వచ్చినా ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం మహానాడులోపు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు మంగళవారం  తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారని తెలుస్తోంది. 

వీరు కాక  విశాఖపట్నానికి చెందిన ‘వాసుపల్లి గణేష్‌కుమార్‌’(విశాఖ సౌత్‌), గణబాబు(విశాఖ వెస్ట్‌), గంటా శ్రీనివాసరావు (విశాఖనార్త్‌), గొట్టిపాటి రవికుమార్‌(అద్దంకి), బాల‌ వీరాంజనేయులు(కొండిపి) జోగేశ్వరరావు(మండపేట), ‘పయ్యావుల‌ కేశవ్‌ (ఉరవకొండ), బి.అశోక్‌ (ఇచ్చాపురం) వంటి ఎమ్మెల్యేలు వైసీపీ  అధినేతతో టచ్ లో ఉండి డీల్  మాట్లాడుకున్నారని, వీరందరూ ‘మహానాడు’ రోజున వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

వీరందరూ చేరకపోయినా…మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే ప్రస్తుతం ప్రతి పక్షనాయకుడిగా ఉన్న ‘చంద్రబాబు’కు ప్రతిపక్షనేత హోదా పోతుంది. ఈ హోదాను పోగొట్టేందుకు వైసీపీ పెద్దలు వీరందరినీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 

Read: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు ప్రభుత్వం రూ.5 వేల ఆర్ధిక సహయం