వీధినపడ్డ గురువు : వీధుల్లో తిరుగుతూ..చీపుర్లు అమ్ముకుంటున్న టీచర్

  • Publish Date - September 19, 2020 / 10:47 AM IST

కరోనా మహమ్మారి ఎంతోమంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది. ఉన్న ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసి వీధిన పడేసింది. దీంట్లో అన్ని వృత్తులవారిదీ అదే పరిస్థితి. న్యాయవాదుల నుంచి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే టీచర్ల వరకూ అదే దుస్థితి. పనిలేక వీధినపడ్డారు.


కొంతమంది కూరగాయాలు అమ్ముకుంటుంటే..మరికొందరు వారి వారి కుల వృత్తులవైపే మళ్లారు. ఇంకొందరు చెప్పులు అమ్ముకుంటుంటే ఓ టీచర్ వీధుల్లో తిరుగుతూ చీపుర్లు అమ్ముకుంటున్నాడు. ముఖ్యంగా ప్రైవేటు టీచర్ల పరిస్థితి ఎంత దీనంగా మారిందో వారి జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇటువంటి దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి.


ఏపీలోని విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం. కోటపాడుకు చెందిన సాంబశివ ఓ ప్రైవేట్‌ స్కూల్ లో హిందీ టీచర్ గా పనిచేసేవారు. కరోనా ప్రభావంతో స్కూల్స్ మూసివేయటంతో సాంబశివ వీధినపడ్డారు. యాజమాన్యం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. దీంతో సాంబశివ విశాఖ సిటీ వదిలి సొంతూరు వెళ్లిపోయి..కుటుంబ పోషణ కోసం ఇంటి వద్ద ఉదయం, సాయంత్రం కూరగాయలు అమ్ముతున్నాడు.


మధ్యాహ్నం సమయంలో సైకిల్ పై వీధుల్లో తిరిగి చీపుర్లు అమ్ముతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో టీచర్ల దుస్థితి ఎంత దీనంగా ఉందో తెలుపుతోంది.స్కూల్‌లో పాఠాలు చెప్పిన పంతులు..వీధుల్లో చీపుర్లు అమ్మడం కలచివేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని కోరుతున్నారు.


మరోపక్క కొన్ని ప్రాంతాల్లో విద్యార్ధులతో కళకళలాడే స్కూల్స్ కోళ్ల ఫారాలుగా మారిపోతున్నాయి. పిల్లల ఆటపాటలతో నిత్యం సందడి సందడిగా ఉండే స్కూల్ ప్లే గ్రౌండ్స్ కూరగాయాలు పండించే పొలాలుగా మారిపోయాయి. దీంతో టీచర్లు వీధినపడిన పరిస్థిత్లుల్లోకి నెట్టేసింది కరోనా మహమ్మారి.