×
Ad

బద్వేలు టీడీపీ ఇంఛార్జ్ మార్పు లాంఛనమేనా? ఎందుకంటే?

బద్వేలు నియోజకవర్గం వీరారెడ్డి కుటుంబం చేతిలో ఉన్నంత వరకూ పార్టీ బలపడే అవకాశం లేదని నియోజకవర్గ నేతలు ఇప్పటికే పలుసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట.

  • వీరారెడ్డి కుటుంబం చేతిలో నుంచి పగ్గాలు చేజారిపోవడం ఖాయమా?
  • ఈ సారి ఇంచార్జ్‌ మార్పు పక్కా అంటున్న తెలుగు తమ్ముళ్లు
  • డీసీసీబీ ఛైర్మన్‌ సూర్యనారాయణరెడ్డికి ఇంచార్జ్ పోస్ట్ ఇవ్వబోతున్నారా?

Kadapa: బద్వేలు.. ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం. ఈ స్థానంలో టీడీపీ గెలవక 20 ఏళ్లు అవుతోంది. 2024 ఎన్నికల్లో కూటమి హవాలోనూ బద్వేల్‌ సీటులో గెలవలేకపోయారు. దీంతో బద్వేలు నియోజకవర్గంపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పెషల్ కాన్సన్‌ట్రేషన్ పెట్టినట్లు చెబుతున్నారు. సీమలో తిరిగి వైసీపీ బలపడకుండా ఎత్తులు వేస్తున్న సీఎం చంద్రబాబు..బద్వేలు నియోజకవర్గంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై రిపోర్ట్ తెప్పించుకున్నారని అంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ సారి నియోజకవర్గ ఇంచార్జ్ మార్పు ఖాయమన్న టాక్ బయలుదేరింది. అందుకు తగ్గట్లే టీడీపీ అధిష్టానం కూడా ఐవీఆర్ఎస్ కాల్స్‌ ద్వారా ఇప్పటికే పబ్లిన్ ఒపీనియన్ సేకరించిందట. రెండు మూడు నెలల క్రితమే..నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న రితేష్‌రెడ్డితో పాటు..కడప డీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ సూర్యనారాయణరెడ్డి పేరుతో అభిప్రాయ సేకరణ చేశారు. వరుసగా మూడు జనరల్ ఎలక్షన్స్‌తో బద్వేల్‌ సీటును కోల్పోవడంతో..ఈ సారి టీడీపీ అధిష్టానం గట్టిగానే ఫోకస్ పెట్టిందట. దీంతో బద్వేలులో రాజకీయంగా ఎంతో పేరున్న బిజి వేముల వీరారెడ్డి కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టడం ఖాయమన్న గుసగుసలు మొదలయ్యాయి.

Also Read: GHMC ఎన్నికలపై మున్సిపాలిటీ ఎన్నికల ప్రభావం పడనుందా?

దివంగత మాజీ మంత్రి బిజి వేముల వీరారెడ్డి బద్వేలు నుంచి రాజకీయంగా ఓ వెలుగు వెలిగారు. ఆయన మరణానంతరం..వీరారెడ్డి రాజకీయ వారసురాలిగా ఆయన కూతురు విజయమ్మ 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. 2004లో పోటీ చేసి ఓడిపోయారామె. తర్వాత 2009లో బద్వేలు ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా టీడీపీ బద్వేలులో గెలవలేదు.

పార్టీకి ఇక్కడ కార్యకర్తల బలం ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు లేక వెనకబడిపోతుంది. వీరారెడ్డి కూతురు విజయమ్మ రెండు సార్లు టీడీపీ అభ్యర్థిని గెలిపించడంలో సక్సెస్ కాలేకపోయారు. తర్వాత వీరారెడ్డి మనవడు యువనేత రితేష్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. యువకుడికి పగ్గాలు అప్పగిస్తే మార్పు వస్తుందని భావిస్తే గతం కంటే పార్టీ మరింత బలహీనంగా మారిందన్న టాక్ మొదలైంది.

గ్రూపు తగాదాలకు కేరాఫ్‌గా రితేష్? 
వర్గపోరు, గ్రూపు తగాదాలకు రితేష్ కేరాఫ్‌గా నిలుస్తున్నట్టు హైకమాండ్ దృష్టికి చేరిందట. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఇరిగేషన్ అధికారి బొజ్జ రోశన్నను ప్రకటించారు. కానీ కూటమి సీట్ల సర్ధుబాటులో బద్వేలు సీటు బీజేపీకి కేటాయించారు. కూటమి ధర్మం పాటిస్తూనే అదే అభ్యర్థిని బీజేపీ తరుఫున పోటీ చేయించాలని విజయమ్మ కోరడంతో చంద్రబాబుతో పాటు కూటమి నేతలు సహకరించారు. బీజేపీ సింబల్‌పై పోటీ చేసి వైసీపీ అభ్యర్థి దాసరి సుధ చేతిలో బొజ్జ రోశన్న ఓడిపోయారు.

నియోజవర్గ ప్రజల్లో రితేష్‌రెడ్డిపై సానుకూల అభిప్రాయం లేదట. ఆయన వైసీపీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయంటున్నారు. అనుభవలేమి అలాగే యువకుడు కావడంతో సీనియర్లను కలుపుకుపోవడంలో సక్సెస్ కాలేకపోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీఆర్ఎస్ కాల్స్‌లో రితేష్‌రెడ్డి కంటే సూర్యనారాయణరెడ్డి వైపే సానుకూల స్పందన వచ్చినట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

బద్వేలు పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్, ప్రస్తుత డీసీసీబీ ఛైర్మన్‌ సూర్యనారాయణ రెడ్డికి ఇంచార్జ్ పోస్ట్ ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. రితేష్ రెడ్డికి సంబంధం లేకుండానే సూర్యనారాయణకు నామినేటెడ్‌ పోస్ట్ ఇచ్చారని.. బద్వేలులో పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కొత్త నేత కోసం వెతికే క్రమంలో సూర్యనాయరాయణ రెడ్డివైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

సమావేశానికి ఆహ్వానం కూడా అందలేదా?
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రస్తుత ఇంచార్జ్‌ రితేష్ రెడ్డిని అధిష్టానం దూరం పెట్టిందని..తాజాగా జరిగిన జిల్లా నాయకుల సమావేశానికి రితేష్ రెడ్డికి, తల్లి విజయమ్మకు ఆహ్వానం కూడా అందలేదని అంటున్నారు. దీంతో ప్రస్తుత ఇంచార్జ్ రితేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కన్ఫ్యూజన్‌లో పడిపోయారట.

నాయకత్వం మార్పుతోనే బద్వేలులో టీడీపీ బలోపేతం అవుతుందని సార్టీ పెద్దలు బలంగా నమ్ముతున్నారని..విభేదాలకు దూరంగా ఉండి సమన్వయం చేసుకునే లీడర్ అయితేనే బెటర్‌ అనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్‌ ఇంచార్జ్‌ పోస్ట్‌ అప్పగించి..ఓ ప్రయోగం చేసి చూడాలన్నది పార్టీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

బద్వేలు నియోజకవర్గం వీరారెడ్డి కుటుంబం చేతిలో ఉన్నంత వరకూ పార్టీ బలపడే అవకాశం లేదని నియోజకవర్గ నేతలు ఇప్పటికే పలుసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. చాలా అవకాశాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో..ఇంచార్జ్‌ను మార్చే యోచనలో ఉన్నారట సీఎం చంద్రబాబు. ఇదే జరిగితే గత నాలుగు దశాబ్దాలుగా వీరారెడ్డి కుటుంబం చేతిలో ఉన్న బద్వేలు పగ్గాలు చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యనారాయణరెడ్డికి బద్వేలు పగ్గాలు దక్కితే..ఆయనకు రితేష్‌రెడ్డి సహకరిస్తారా.? లేక వర్గపోరుకు తెరలేపినట్లు అవుతుందా.? అన్న చర్చ కూడా జరుగుతోంది.