టీడీపీ సీనియర్లను టెన్షన్ పెడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే

రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు టెన్షన్ లో ఉన్నారు.

Telugu desam party senior leaders tesnion on IVRS surey

Telugu desam party : తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులకు టికెట్ల టెన్షన్ పట్టుకుంది. ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఫస్ట్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయిన నాయకులు రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. తమ టికెట్ల కోసం అధినేత నివాసం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. ఈనేపథ్యంలో ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్లను టెన్షన్ పెడుతోంది. తాము ఆశించిన స్థానాల్లో తమతో పాటు రేసులో ఉన్న ఇతర నేతల పేరుతోనూ సర్వేలు నిర్వహిస్తుండడంతో టీడీపీ సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు.

పెనమలూరులో దేవినేని ఉమా, ఎంఎస్ బేగ్ పేరుతో సర్వే చేస్తున్నారు. నరసరావు పేటలో యరపతినేని శ్రీనివాసరావు పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతోనూ సర్వే జరుగుతోంది. రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టెన్షన్ లో ఉన్నారు. ఆనం రామానారాయణ రెడ్డి పేరుతో వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. గురజాలలో జంగా కృష్ణమూర్తి పేరుతో సర్వే జరుగుతోంది.

ఎచ్చెర్ల నుంచి టిక్కెట్ ఆశిస్తోన్న కళా వెంకట్రావుకు అధిష్టానం నుంచి క్లారిటీ రాకపోవడంతో ఆయన ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లి టిక్కెట్ ఆశించి భంగపడ్డ పీలా గోవింద్ కూడా డైలమాలో ఉన్నట్టు సమాచారం. నిన్న చంద్రబాబును కలిసిన తర్వాత కూడా ఆయనకు భరోసా దక్కలేదని తెలుస్తోంది. పెందుర్తి టిక్కెట్ ఆశిస్తోన్న బండారు సత్యనారాయణరావుకు కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు కూడా టికెట్ ఖరారు కాలేదు. చీపురుపల్లి వెళ్లమని గంటాకు సూచించగా, భీమిలి కావాలంటూ ఆయన పట్టుబడుతున్నారు.

Also Read: టీడీపీలో కొనసాగుతున్న టికెట్ల పంచాయితీ.. చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం

దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ కు ఇంకా సీటు ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో చింతమనేని కుమార్తె పేరుతో దెందులూరులో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఉంగుటూరు టిక్కెట్ ఆశిస్తోన్న గన్ని వీరాంజనేయులు, కొవ్వూరు టిక్కెట్ కోసం మాజీ మంత్రి జవహర్ వెయిటింగ్ లో ఉన్నారు. సీనియర్ నాయకుల్లో ఎవరెవరికీ టికెట్లు దక్కుతాయో చూడాలి. కాగా, టీడీపీ ఫస్ట్ లిస్టులో 23 మంది కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు