ఏం చర్చించనున్నారు : కేసీఆర్, జగన్ ఏకాంత భేటీ

  • Publish Date - January 13, 2020 / 12:33 AM IST

తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్‌లోనే మూడు సార్లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో జరిగిన సమావేశాల్లో.. అధికారులు, మంత్రులు పాల్గొంటే… ఈసారి మాత్రం కేవలం ఇద్దరు సీఎంలు మాత్రమే భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 2020, జనవరి 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఈ సమావేశం జరుగబోతోంది. 

 

మూడున్నర నెలల తర్వాత ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఇద్దరు సీఎంలు భేటీ అవుతున్నారు. కేసీఆర్‌, జగన్‌ సమావేశంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ లాంటి కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. సీఏఏకు వైసీపీ మద్దతు తెలిపినా… ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేంద్రం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈ బిల్లుల్ని వ్యతిరేకించాలంటూ ఎంఐఎం డిమాండ్ చేస్తోంది.

 

ఈ వ్యవహారంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. అలాగే గతంలో చర్చించిన నదుల అనుసంధానంతో పాటు ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన కూడా వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. రెండు రాష్ట్రాలు ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా విభజన అంశాల్లో చాలా వరకు అపరిష్కృతంగానే ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగుల పంపకం, ఢిల్లీలో తెలంగాణ భవన్ విభజనతో పాటు 9,10 షెడ్యూళ్లలోని అంశాలపైనా ఇద్దరు సీఎంలు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

* రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలతో పాటు… ఇరిగేషన్, ఇతర అంశాలపై ముఖ్యమంత్రులిద్దరూ గత సమావేశాల్లో చర్చించారు.
* కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఉమ్మడిగా చేపట్టాలని నిర్ణయించారు.
* దీనికి అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాలని అంగీకారానికి వచ్చారు.
* సమస్యల పరిష్కారానికి కలిసి నడవాలని భావించారు.
* కేంద్రానికి సంబంధించిన అంశాలపై కూడా ఉమ్మడిగా వెళ్లాలని అనుకున్నారు.
* తెలంగాణలో ప్రాజెక్టు నిర్మించి గోదావరి నీటిని కృష్ణా నదిలోకి లిఫ్ట్ చేయాలనే నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది.
 

* దీంతో.. ఏపీ సర్కార్ కాస్త వెనక్కి తగ్గింది.
* కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది.
* పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతామని జగన్ ప్రకటించారు.
* గోదావరిపై తెలంగాణ కోసం ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకున్నారు.
* ఇలా ఇరు రాష్ట్రాలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి విడి విడిగా ప్లాన్ చేసుకున్నారు.
* దీంతో… రెండు రాష్ట్రాల సీఎం మధ్య గ్యాప్ వచ్చిందనే వాదన వినిపించింది. 

Read More : అర్థరాత్రి నేషనల్ హైవేపై పోర్న్ వీడియోలు ప్రసారం