Chalo Proddatur: ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు వ్యతిరేకిస్తూ ఆందోళన

కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Chalo Proddatur

Proddatur: కడప జిల్లాలో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మునిసిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కార్యాలయం ఎదుట బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆందోళన చేపట్టారు. ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

పోలీసులకు, బీజేపీ నేతలు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోగా.. టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయనున్న ప్రదేశానికి వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోము వీర్రాజును అదుపులోకి తీసుకుని కడప ఎయిర్ పోర్టుకు తరలించారు పోలీసులు. బీజేపీ నేతలు ఆందోళన విరమించాలని డీఎస్పీ కోరినా.. వారు ఒప్పుకోకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తలించారు.

ఈ సంధర్భంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. అన్నీ కులాలు, మతాలకు ప్రాధాన్యం ఇస్తానని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి టిప్పు సుల్తాన్ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో హిందూ మతానికి వ్యతిరేకంగా పరిపాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుచేసినా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఆందోళనలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ.. ప్రొద్దుటూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.