AP Assembly : చట్టాలు చేసే అధికారం న్యాయవ్యవస్థకు లేదు..అది చట్టసభలకే ఉంది’ : ధ‌ర్మాన ప్రసాదరావు

చట్టాలు చేసే అధికారం న్యాయవ్యవస్థకు లేదు..చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న శాస‌న వ్య‌వ‌స్థ‌దే’ అంటూ ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్రసాదరావు అన్నారు.

Dharmana Prasadrao Comments In Assembly

AP Assembly : చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న శాస‌న వ్య‌వ‌స్థ‌దే’ అంటూ ఏపీ అసెంబ్లీలో ధ‌ర్మాన ప్రసాదరావు వ్యాఖ్య‌ానించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాలన వికేంద్రీకరణ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చర్చ ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని..మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్‌కు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించానని కూడా ధర్మాన తెలిపారు. మూడు రాజధానులు విషయం గురించి అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను అని అన్నారు. ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే ఇది పరువు తీసుకోవడమేనని..ఇది సరైంది కాదని సూచించారు.

శాసనాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్‌కు తప్ప వేరే వాళ్లకు లేదు ఆఖరికి న్యాయవ్యవస్థకు కూడా లేదు అని అన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన సందర్భంలో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. ప్రభుత్వం మారితే విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని న్యాయవ్యవస్థ ఎలా చెప్తుంది? అంటూ ఈసందర్భంగా ధర్మాన ప్రశ్నించారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. ఈ మూడు వ్యవస్థల్లో ప్రజాభిప్రాయాన్ని తెలిపేది కేవలం శాసన వ్యవస్థ మాత్రమే అని ధర్మాన అన్నారు.