కరోనా బారిన పడినా ఏపీ ప్రభుత్వం తరుఫున బలమైన వాదనలు వినిపిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు విన్న వారికి కళ్లు చెమ్మగిల్లాయి. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన కరోనాకు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో బెడ్ మీద నుంచే తన వాదనలు వినిపించారు.
పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అంటే న్యాయ వ్యవస్థలో బాగా సుపరిచితమైన పేరే. మొదటి నుంచి వైసీపీ కేసులను వాదిస్తున్న న్యాయవాదుల్లో పొన్నవోలు ఒకరు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన్ను అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా నియమించారు.
ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. డీఈడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై జరిగిన విచారణకు వీడియో ద్వారా హాజరై …… ఈ విషయాన్ని తనే భావోద్వేగంతో ప్రకటించి అందరి మనసుల్ని కదిలించారు.
అప్పీళ్ల విచారణ సందర్భంగా సెప్టెంబర్ 30, బుధవారం హైకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. ప్రభుత్వం తరపు వాదిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేతికి సెలైన్, ఆక్సీమీటర్‌తో కనిపించి షాక్ ఇచ్చారు.
“కొవిడ్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నానని, ప్రస్తుతం మరణశయ్యపై ఉన్నానన్నారు. బహుశా ఈ కేసులో ఇవే నా చివరి వాదనలు కావచ్చని, మరోసారి వాదనలు వినిపించే అవకాశం వస్తుందో రాదో తెలియదని, కావున తన మొర ఆలకించాలని ఆయన భావోద్వేగంతో వేడుకున్నారు.” ఈ మాటలు హై కోర్టు ధర్నాసనాన్ని కదిలించాయి.
వాదనలు వింటున్నజస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడా ధర్మాసనం సానుభూతితో స్పందిస్తూ … ప్రస్తుతం వైరస్‌తో భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పింది. మీరు త్వరగా కోలుకుని తిరిగి వచ్చి తమ ముందు తప్పక వాదనలు వినిపిస్తారని సాంత్వన కలిగేలా ఓదార్పు మాటలు చెప్పింది. ఏది ఏమైనా పొన్నవోలు త్వరగా కోలుకుని సమాజానికి ఉపయోగపడేలా తన విధులు నిర్వర్తించాలని కోరుకుందాం.