AP బీజేపీలో అయోమయం : మూడు రాజధానులపై తలోమాట

  • Publish Date - December 22, 2019 / 01:25 AM IST

ఏపీలో మూడు రాజధానుల ప్రకటనలపై బీజేపీలో గందరగోళం నెలకొంది. నేతలు తలోమాట మాట్లాడుతున్నారు. తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు.  ఒకరు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంటే.. మరొకరు స్వాగతిస్తున్నారు. ఒకరు అమరావతిలోనే సీడెడ్‌ క్యాపిటల్‌ ఉండాలంటుంటే… మరొకరు మూడు రాజధానులూ మంచి నిర్ణయమేనని అభిప్రాయపడుతున్నారు.  నేతలు తలోమాట మాట్లాడుతుండడం రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని జగన్‌ ప్రభుత్వం ఫుట్‌బాల్‌ ఆడుకుంటోందని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి సీ కేపిటల్‌గా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జీఎన్‌రావు కమిటీది ఏకపక్ష నివేదికంటూ కొట్టిపారేశారు. 
విశాఖకు చెందిన బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు జీఎన్‌రావు రిపోర్ట్‌ను స్వాగతిస్తున్నామని ప్రకటించారు.

ఆ కమిటీ అద్భతమైన నిర్ణయాలు చేసిందని మెచ్చుకున్నారు. విశాఖను పరిపాలనా రాజధాని చేయడం అందరికీ సంతోషం కలిగించే విషయమని అభిప్రాయపడ్డారు. సెక్రటేరియట్‌, అసెంబ్లీ విశాఖలో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానుల ప్రకటనపై స్పందించారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు.

సీఎం జగన్‌ నుంచే ఈ పరిస్థితిని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకుంటున్నామని పరిపాలన వికేంద్రీకరణను కాదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో తమ పార్టీకి చెందినవారు ఏం మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీ అభిప్రాయం ప్రకారం 3 చోట్ల రాజధానులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనతోనైనా బీజేపీ నేతల్లో స్పష్టత వస్తుందో లేదో చూడాలి.
Read More : ఏపీ కేపిటల్ హీట్ : ముఖ్యమంత్రి మారినప్పుడల్లా..రాజధానిని మారుస్తారా