×
Ad

Perni Nani: తిరుమలపై ఆ జీవో ఇచ్చిందే వైఎస్ఆర్.. ఆ విషయంలో పవన్ కల్యాణ్ చంద్రబాబునే మించిపోయారు- పేర్నినాని

జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు, పవన్, లోకేష్ తప్ప ఏ రిపోర్ట్ చెప్పింది..? సీబీఐ చార్జిషీట్ లో అసలు జగన్ పేరుందా..?

  • Published On : February 5, 2026 / 08:06 PM IST

Perni Nani

 

  • వేంకటేశ్వరుని బొమ్మపై గన్ పెట్టి జగన్ ని కాల్చేందుకు కుట్ర
  • చంద్రబాబు చేసిన పాపం ఆయనకి తెలుసు, అందుకే అసహనం
  • దమ్ముంటే కొవ్వు కలిసిందని చంద్రబాబు మళ్లీ చెప్పాలి

Perni Nani: రాజకీయాల కోసం కూటమి నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అనేకసార్లు దేవుడిపై నమ్మకం లేదని పవన్ కల్యాణ్ చెప్పారని.. అలాంటి పవన్ ప్రస్తుతం రాజకీయాల కోసం దేవుడిని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏడు కొండల్లో అన్యమత ప్రచారం చేయొద్దని జీవో ఇచ్చింది అప్పటి వైఎస్ సర్కార్ అని, దాన్ని రెండు కొండలుగా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు.

”రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట ఈరోజు చంద్రబాబు, పవన్ ల ప్రెస్ మీట్. వేంకటేశ్వరుని బొమ్మపై గన్ పెట్టి జగన్ ని కాల్చడానికి కుట్ర చేస్తున్నారు. దేవుడి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న మీరేమైపోతారు..? ఇంతకంటే పాపం ఎక్కడైనా ఉంటుందా..? 7 కొండలను తిరుమల దివ్య క్షేత్రమని జీవో ఇచ్చింది వైఎస్ఆర్. రూ.320 కి నెయ్యి ఎలా కొంటారని పవన్ అడుగుతున్నారు. చంద్రబాబు రూ.219 కే కొన్న విషయం పవన్ కి తెలియదా..? గత టీడీపీ హయాంలో హార్ష్ ఫ్రెష్ డైరీ నుండి 219 రూపాయలకి మీరెలా కొన్నారు..? జగన్ పై విషం చిమ్మడంలో చంద్రబాబునే మించిపోయారు పవన్ కళ్యాణ్. చంద్రబాబునే కాదు పవన్ ని కూడా ప్రజలు నమ్మడం మానేశారు.

”అయోధ్యకి పంపిన లడ్డూలు పంది కొవ్వుతో అపవిత్రమన్నారు. ఇంతకన్నా నీచమైన మాటలు ఉంటాయా..? అయోధ్యకి లడ్డూలు పంపే ప్రపోజల్ సౌరబ్ గౌర్ పెట్టారు. 2వేల కేజీల శ్రేష్టమైన నెయ్యి వారే సేకరించి తెచ్చుకుని లడ్డూ తయారు చేసి పంపారు. సుప్రీంకోర్టు వేసిన సిట్ రిపోర్ట్ జంతువుల కొవ్వు లేదని చెప్పినా చంద్రబాబు అంగీకరించడం లేదు. జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు, పవన్, లోకేష్ తప్ప ఏ రిపోర్ట్ చెప్పింది..? చంద్రబాబు.. మీకు దమ్ముంటే కొవ్వు కలిసిందని మళ్లీ చెప్పు.. మట్టికొట్టుకుపోతావ్. చంద్రబాబు చేసిన పాపం ఆయనకి తెలుసు. ఆయనకి లోపల దహించేస్తుంది. అందుకే అసహనానికి గురవుతున్నాడు.

సీబీఐ చార్జిషీట్ లో అసలు జగన్ పేరుందా..? వైవీ సుబ్బారెడ్డి, భూమన, దేవాదాయశాఖ మంత్రి, అధికారుల పేర్లు ఏమైనా ఉన్నాయా..? లేవు కదా..? వెనక్కి పంపిన AR డైరీకి చెందిన నాలుగు ట్యాంకర్లు నెల తర్వాత మళ్లీ కొండపైకి వెళ్ళాయి. ఇన్వాయిస్ మార్చి మళ్లీ వచ్చిన ట్యాంకర్లలోని అదే నెయ్యితో లడ్డూలు తయారు చేశారు. జంతువుల కొవ్వు అని ప్రచారం చేసిన ట్యాంకర్లను మళ్లీ ఎలా లడ్డూల్లో వినియోగించారు..?” అని పేర్నినాని ప్రశ్నించారు.

Also Read: ఏడు కొండల వాడితో పెట్టుకున్న వాడు మట్టిలో కలిసిపోతాడు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు