దర్శనానికి వేళాయే : తిరుమలకు వెళ్లేవారు..తెలుసుకోవాల్సిన విషయాలు

  • Publish Date - June 11, 2020 / 12:19 AM IST

భక్తులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఏడుకొండల వాడి దర్శనానికి వేళైంది. కాసేపట్లో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది. కరోనా కారణంగా మార్చి 19 అర్థరాత్రి నుంచి భక్తులను తిరుమలలోకి అనుమతించలేదు. 80 రోజుల తర్వాత స్వామివారి సేవకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. రెండ్రోజులు టీటీడీ సిబ్బంది, ఒకరోజు తిరుమల స్థానికులకు స్వామిదర్శనానికి అనుమతిచ్చారు.

6 నుంచి 7 వేల మందికి మాత్రమే : – 
2020, జూన్ 11వ తేదీ గురువారం నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు. రోజుకు 6నుంచి 7 వేల మందికి మాత్రమే దర్శనభాగ్యం ఉంటుంది. క్యూ కాంప్లెక్స్‌లోకి గంటకు 5వందల మందినే అనుమతిస్తారు. పరిస్థితిని బట్టి భక్తుల కోటాను పెంచే అవకాశం ఉంది. ఉదయం ఆరున్నర నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకూ స్వామివారి దర్శనం ఉంటుంది.

మాస్క్ కంపల్సరీ : – 
అయితే శ్రీవారి దర్శనానికి  వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలను  ఆలయంలోకి అనుమతించరు. భక్తులకు మాస్క్‌ అన్నది తప్పనిసరి చేశారు. మాస్క్‌ లేకుంటే దర్శనానికి ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు. అంతేకాదు.. భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శనానికి వెళ్లే ముందు, హుండీ దగ్గర హెర్బల్‌ శానిటైజ్ ఏర్పాట్లు చేశారు. అన్ని కంపార్ట్ మెంట్లలో కూడా సీటింగ్ మధ్యలో భౌతికదూరం పాటించేందుకు మధ్యలో మార్కింగ్ చేశారు. క్యూ లైన్లలో కూడా మార్కింగ్ కోసం స్టిక్కర్లు అతికించారు. 2 మీటర్ల దూరం పాటించేలా వాటిని ఏర్పాటు చేసారు. 

థర్మల్ స్క్రీనింగ్ : – 
దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి అలిపిరి వద్దే థర్మల్‌ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలున్నా కొండపైకి అనుమతించరు. కాలినడకన కొండెక్కే భక్తులు అలిపిరి మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారిమెట్టు మార్గంలో అనుమతి లేదు. ఇక కొండపైకి వచ్చే ప్రతివాహనాన్ని శానిటైజ్ చేయనున్నారు.
అలిపిరి గేటు వద్ద సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు.

80 రోజుల తర్వాత : – 
తిరుమలలో ప్రైవేట్‌ హోటల్స్‌కు అనుమతి లేదు. దీంతో భక్తులు అన్నదాన సత్రం మీదనే ఆధారపడాలి. అక్కడ కూడా భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో ముగ్గురు, నలుగురు భక్తులు కూడా కూర్చున్న టేబుల్ కి ప్రస్తుతం ఇద్దరు మాత్రమే కూర్చునేలా మార్పులు చేశారు. ఇక కల్యాణకట్ట దగ్గర విధులు నిర్వహించే సిబ్బందికి కూడా పీపీఈ కిట్లు అందిస్తున్నారు. దాదాపు 80 రోజుల తర్వాత శ్రీవారి దర్శనం భాగ్యం కలుగుతుండడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  శ్రీవారి దర్శనం కోసం అప్పుడే కొండపైకి వస్తున్నారు. మరికొంతమంది క్యూలైన్లలో వేచి ఉన్నారు.

Read: వైసీపీలో చేరిన మాజీ మంత్రి : ప్రకాశం జిల్లా టీడీపీకి మరో షాక్