Tirupati Double Murder : తిరుపతి జంట హత్యల కేసులో బిగ్ ట్విస్ట్.. పెళ్లి వివాదమే కారణమా? పోలీసుల అదుపులో ముగ్గురు

Tirupati Couple Murder Case : తిరుపతిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి వివాదమే హత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో సునీల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Tirupati Double Murder Case Wedding Dispute Sunil Arrest

  • భార్యాభర్తల వివాదంతో మొదలైన గొడవ..
  • మధ్యవర్తులను లక్ష్యంగా చేసుకుని దాడి
  • ఇద్దరు వ్యక్తులు మృతి.. దర్యాప్తు చేస్తున్నపోలీసులు

Tirupati Double Murder : తిరుపతిలో జంట హత్యల ఘటన సంచలనం సృష్టించింది. తిరుచానూరు రోడ్డులోని టీటీడీకి చెందిన పద్మావతి కల్యాణ మండపం సముదాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళతోపాటు నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో.. జీవకోన ప్రాంతానికి చెందిన మునిరత్నం (50) ఘటన స్థలిలోనే మరణించగా.. సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన మణికంఠ (41) తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఏర్పేడు మండలం జంగాపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ పెళ్లి వ్యవహారంలో తలెత్తిన వివాదమే ఈ దారుణ హత్యలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

Also Read – AP Rains Today : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ

పోలీసుల వివరాల ప్రకారం.. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను సునీల్ అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో సునీల్ తన భార్యను విడిచిపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నగరంలోని పద్మావతి కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జరిగిన ఓ వివాహానికి సునీల్ వస్తున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ అక్కడికి చేరుకుంది. వివాహానికి మధ్యవర్తులుగా వ్యవహరించిన మునిరత్నం, మణికంఠలను పిలిపించి ఈ విషయమై నిలదీసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది.

తనను నిలదీశారని సునీల్ తన తండ్రికి సమాచారం అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో సునీల్ తండ్రి, తమ్ముడు, అక్కతో పాటు మరో యువకుడు కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చిన మునిరత్నం, మణికంఠలపై ముందస్తు ప్రణాళిక ప్రకారం కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి నిందితులు పరారయ్యారు. ఈ దాడిలో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మణికంఠను రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సునీల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హత్యలకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.