Tirupati Red Smugglers Eyes On New Way : ఎర్రచందనం స్మగ్లర్స్ బాగా తెలివి మీరారు. రెడ్‌శాండిల్ స్మగ్లింగ్ కట్టడికి పోలీసులు ఆధునిక పద్ధతులు పాటిస్తే… వారికి చిక్కకుండా స్మగ్లర్స్ పైఎత్తులు వేస్తున్నారు. శ్రీవారి దర్శనానికంటూ బయలుదేరి.. శేషాచల అడవుల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తిరుమల శేషాచలం కొండల్లో ఉన్న ఎర్రచందనం సంపదను చేజిక్కించుకునేందుకు స్మగ్లర్స్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
తిరుమల అడవుల్లో ప్రవేశానికి ఉన్న అనేక మార్గాల్లో గత కొంతకాలంగా పోలీసుల నిఘా పెరిగింది. స్మగ్లర్ల కదలికలను వారి రాకపోకలను ఎప్పటికప్పుడు పోలీసులు పసిగడుతూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా స్మగ్లర్స్‌పై అనేక మార్గాల్లో పోలీసులు నిఘా పెరిగింది. స్థానికుల నుంచి కూడా పోలీసులకు ఎప్పటికప్పుడు స్మగ్లర్లకు సంబంధించిన సమాచారం అందుతోంది.
దీంతో ఎర్రచందనం దొంగలు…. రూటు మార్చుతున్నారు. రెడ్‌శాండిల్ కొట్టేయడానికి కొత్త కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల కన్ను ఇప్పుడు తిరుమల కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టుపై పడింది. నిజానికి ఈ శ్రీవారి మెట్లమార్గం శేషాచల అడవిని చీల్చుకుంటూ కొండపైకి వెళ్తుంది.
దట్టమైన అడవి మధ్యలో ఈ కాలినడక మార్గం ఉంది. ఈ మెట్లమార్గం నుంచి శేషాచలంలోకి వెళ్లడం చాలా ఈజీ. స్మగ్లర్లు, కూలీలు ఇప్పుడు ఈ మార్గాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్‌కు రాజమార్గంగా భావిస్తున్నారు. భక్తుల ముసుగులో కొంతమదూరం ఈ మెట్లు ఎక్కి.. ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోతున్నారు.
ఈ మార్గంగుండా నడిచి కొండపైకి వెళ్తోన్న 15మంది బృందంపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి వివరాలు అడగడం మొదలుపెట్టడంతో.. అంతా ఒక్కసారిగా దౌడ్ తీశారు. పక్కనే ఉన్న అడవిలోకి దూకి మాయమైపోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే పోలీసులకు చిక్కాడు.
అతని దగ్గర ఉన్న బ్యాగును క్షుణ్ణంగా పరిశీలించగా… మూడు జతల దస్తులు ఉన్నాయి. పట్టుబడిన వ్యక్తి తమిళనాడు తిరువన్నామలై జిల్లా వెళ్లచెరువుకు చెందిన వెంకటేశన్‌గా గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కోసమే అతడు వచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
ఏదేమైనా భక్తుల ముసుగులో స్మగ్లింగ్ కోసం వస్తున్న ఈ కూలీలు… పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. దీంతో శ్రీవారి మెట్లమార్గంలో మరింత నిఘా పెంచాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్ణయించారు.