Tomato Prices: భారీగా పడిపోయిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే? ఎందుకిలా?

ఏపీలో స్థానిక వ్యాపారులకు మాత్రమే టమాటాలను రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది.

Tomato Price

టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కనీసం పెట్టిన పెట్టుబడైనా రావట్లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం రైతులకు కిలో టమాటాలకు రూ.2-రూ.6 మధ్య మాత్రమే ఇస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు టమాటాలను కనీసం మార్కెట్లకు కూడా తీసుకుపోకుండా పొలాల వద్దే పారేస్తున్నారు.

ఇక రైతులు మార్కెట్‌కు టమాటాలను తీసుకువెళ్తే 25 కిలోల టమాటా బాక్సుకు కేవలం రూ.50 – రూ.150 మధ్యే దక్కుతున్నాయి. మార్కెట్లో 25 కిలోల టమాటా బాక్సుకు కనీసం రూ.400 ఇస్తేనే ఎంతో కొంత లాభాలు వస్తాయి.

Also Read: వైసీపీని వీడుతున్న వారిలో వీరే ఎక్కువ.. తోట త్రిమూర్తులు కూడా రెడీ!

చిల్లర వ్యాపారులు మార్కెట్లో కిలో టమాటాను రూ.10 – రూ.20 మధ్య విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్‌లో నిన్న 15 కిలోల బాక్సుకు గరిష్ఠంగా కేవలం రూ.90 మాత్రమే ఇచ్చారు. ఇక కనిష్ఠంగా రూ.30 ఇవ్వడంతో రైతులు తమ గిట్టుబాటు కాదని వాపోయారు.

చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రజల అవసరాలకు ఆయా రాష్ట్రాల టమాటాలు సరిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల వ్యాపారులు ఏపీకి వచ్చి కొనడం లేదు. ఏపీలో స్థానిక వ్యాపారులకు మాత్రమే టమాటాలను రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో ఏపీలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఏప్రిల్‌ నుంచి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.