ఏపీలో రాజ్యసభ ఎంపీల సీట్ల పోట్లాట మొదలైంది. రాజ్యసభ సీట్ల కోసం నేతలంతా ఆశగా చూస్తున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించడంతో రాజ్యసభ రేసు మొదలైంది. ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వరంతా ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం లాబీయింగ్ కూడా మొదలు పెట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ నెలలో రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడానికి ఇంకా సమయం ఉంది.
ఇలోపే అధికార పార్టీలో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. రాజ్యసభ పట్టేందుకు నేతలంతా పావులు కదుపుతున్నారు. ఈ రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి నాలుగు సీట్లు దక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి వైసీపీలో పెద్ద లిస్టే రెడీ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరూ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈసారి రాజ్యసభ ఎన్నికలో కొత్త ముఖాలు కనిపిస్తాయని ఏపీ రాజకీయ వర్గాల సమాచారం. కొత్తగా పలువురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.
రాజ్యసభ రేసులో నేతల పేర్ల జాబితా ఇలా వినిపిస్తోంది. ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ సీటు దాదాపు ఖరారు అయినట్టేననే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన నేతల్లో ఆళ్ల రామిరెడ్డి కూడా ఉన్నారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన ఈయన బంధువు వారి కుటుంబానికి రాజ్యసభ సీటు విషయంలో భరోసా లభించినట్టేనని అంటున్నారు. ఆళ్లకు రాజ్యసభ నామినేషన్ ఖరారు అయ్యిందని ప్రచారం కూడా ఉంది. మిగిలిన 3 సీట్ల విషయంలో మాత్రం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి వైవీ సుబ్బారెడ్డికి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆయన ఎంపీ టికెట్ త్యాగం చేశారు. దీంతో వైవీకి రాజ్యసభ సీటు దక్కుతుందని అంటున్నారు. ఇప్పటికే వైవీకి టీటీడీ చైర్మన్ హోదా ఉండటంతో ఈసారి రాజ్యసభ రేసులో చోటు దక్కుతుందా? లేదా అనేది డౌటే..
ఇక బీద మస్తాన్ రావు పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. ఇంతలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పేర్లు కూడా తెర మీదకు రావడం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రం కచ్చితంగా రాజ్యసభ సీటు లభిస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. ఇంకా ఈ జాబితాలో కిల్లి కృపారాణి సహా పలువరు ఆశావహులుగా ఉన్నట్టు సమాచారం. నాలుగో సీటు విషయానికి వస్తే.. బీజేపీ మాట వినపడుతోంది. ఇటీవలే వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఒక రాజ్యసభ సీటు విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగినట్టు పెద్ద టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో మొత్తం అధికార పార్టీకి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కనుండగా.. అందులో ఒకటి బీజేపీకి కేటాయించాల్సిందిగా అమిత్ షా.. సీఎం జగన్ ను అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ నిజంగానే అమిత్ షా అడిగి ఉంటే జగన్ కాదంటారా? అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాజ్యసభ సీటు రేసులో కొత్తగా మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ షర్మిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ రాజ్యసభ నాలుగు సీట్లు ఎవరికి దక్కనున్నాయి అనేది సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి.. ఎవరికి ఈ నాలుగు సీట్లు దక్కుతాయో? చూడాలి.