Andhrapradesh : ఏపీలో విషాద ఘటన.. ప్రాణాలు తీసిన బైక్ పొగ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..

Andhrapradesh : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

Andhrapradesh

  • అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన
  • బైక్ నుండి వచ్చే పొగ పీల్చి నలుగురు మృతి
  • మృతుల్లో ముగ్గురు చిన్నారులు

Andhrapradesh : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో ఈ విషాద ఘటన జరిగింది. మృతి చెందిన వారిలో తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు. అయితే, పైన గదిలో నిద్రించడంతో భార్యాభర్తలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పిల్లల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Farmhouse drug party : ఫామ్‌హౌస్‌‌ డ్రగ్స్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి.. డ్రగ్స్ తెచ్చింది ఎవరంటే?

పుంగనూరులోని త్యాగరాజు వీధికి చెందిన మురళి, రేవతి భార్యాభర్తలు. వారికి కార్తీక్‌, కవల కుమార్తెలు చరిత, చందన ఉన్నారు. మురళి తండ్రి రామచంద్రయ్య వారితోనే ఉంటున్నాడు. మురళి వాడుతున్న బైక్ రిపేరు రావడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. ఇంజిన్ సమస్య ఉందని గుర్తించిన మెకానిక్ బోర్ చేయించాడు. అనంతరం బైక్‌ను ఇంటికి తీసుకెళ్లి రాతంత్రా ఇంజిన్ ఆన్‌లో ఉంచాలని మెకానిక్ మురళికి సూచించాడు. దీంతో బైక్‌ను ఇంటికి తీసుకెళ్లిన మురళి ఇంట్లో తలుపులు వేసి ఇంజిన్‌ను ఆన్ చేశాడు.

శనివారం రాత్రి రామచంద్రయ్య మనవడు, ఇద్దరు మనవరాళ్లతో కలిసి ఇంట్లో నిద్రించగా.. మురళి, రేవతి ఇంటిపైన గదిలో పడుకున్నారు. అయితే, ఇరుకు గదిలో బైక్ ఉంచడంతో దాని నుండి వెలువడిన కార్భన్ మోనాక్సైడ్ గది నిండా వ్యాపించింది. నిద్రలో ఉన్న నలుగురు ఆ విషవాయువును పీల్చి ఊపిరాడక ప్రాణాలు విడిచారు. మృతుల్లో ముగ్గురు చిన్న పిల్లలు ఉండటం అందరినీ కలిచివేసింది. మురళి, రేవతి పైన గదిలో పడుకోవటంతో వారు ప్రాణాయం నుంచి తప్పించుకున్నారు. ముగ్గురు బిడ్డలు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.