Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. బీమా సదుపాయం కల్పించేందుకు టీటీడీ కసరత్తు..

శ్రీవారి దర్శనార్ధం తిరుమల వెళ్లే భక్తులకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala: శ్రీవారి దర్శనార్ధం తిరుమల వెళ్లే భక్తులకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీరోజూ శ్రీవారి దర్శనార్ధం 70వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. తిరుమల కొండపైకి వెళ్లే సమయంలోనూ, తిరుమల కొండపై అప్పుడప్పుడు భక్తులు పలు ప్రమాదాలకు గురవుతుంటారు. ఈనేపథ్యంలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు బీమా సదుపాయాన్ని కల్పించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది.

 

తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ పాలక మండలి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జూన్ 17వ తేదీన తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశంలో అజెండాతో సంబంధం లేకుండా తిరుమల యాత్రికులకు బీమా సదుపాయం కల్పించడంపై కొందరు పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

 

ఈ ఏడాది జనవరిలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన టీటీడీని కుదిపివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఆర్థిక సాయం అందించింది. అప్పటి నుంచే యాత్రికులకు బీమా సదుపాయం కల్పించాలన్న ఆలోచన మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంలో సభ్యులు ప్రస్తావించినట్లు తెలిసింది. రెండు ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గం, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో ప్రమాదాలకు గురికావడం, ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడడం, నకడ మార్గంలో అటవీ జంతువుల దాడి లాంటి ఘటనల నేపథ్యంలో భక్తులకు బీమా కల్పించాలని యోచిస్తున్నారు. తద్వారా ప్రమాదాలు, ఆకస్మిక గుండెపోటు, జంతువుల దాడిలో మృతిచెందిన వారికి బీమాతో చేయూతనందించాలని చూస్తున్నారు.

 

తిరుమల వచ్చివెళ్తున్న భక్తులు అనారోగ్యం బారిన పడినా, గాయపడినా ఇప్పటి వరకూ వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అదేవిధంగా.. ఎవరైనా అనారోగ్యంతో, ప్రమాదాల్లో మరణిస్తే వారి కుటుంబాలకు టీటీడీ ఎక్స్‌గ్రేషియా తరహాలో ఆర్థిక సాయం అందిస్తుంది. అయితే, ఇక నుంచి అలిపిరి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి అలిపిరి వరకు భక్తులు చేరుకునే వరకు బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకోసం బీమా కల్పించే సంస్థలు, అవి వసూలు చేసే ప్రీమియం, దాతల సహకారం తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను టీటీడీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే, రోజువారీగా భారీగా వచ్చే భక్తులకు బీమా కల్పించడం సాధ్యమేనా? దర్శనం టికెట్‌ గానీ, టైమ్‌ స్లాట్‌ టోకెన్‌ గానీ లేకుండా వచ్చే సర్వదర్శనం భక్తుల మాటేమిటి? అంటూ తర్జనభర్జనలు సాగుతున్నాయి.