TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. అవన్నీ ఫేక్.. జాగ్రత్త సుమీ!
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్‌ల పేరుతో సాగుతున్న సైబర్ మోసాల పట్ల టీటీడీ (TTD)భక్తులను అప్రమత్తం చేసింది.
- V Santhosh Kumar
- Published on- August 14, 2026 / 08:48 PM IST
TTD warns devotees against fake websites and cyber frauds
- నకిలీ సైట్లపై టీటీడీ హెచ్చరిక
- 259 ఫేక్ వెబ్‌సైట్లు బ్లాక్
- అధికారిక యాప్‌లోనే దర్శనం బుకింగ్
TTD: తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్‌ల పేరుతో సాగుతున్న సైబర్ మోసాల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులను తీవ్రంగా అప్రమత్తం చేసింది. టీటీడీ అధికారిక ముద్ర, లోగో, చిత్రాలు, ట్రేడ్‌మార్క్‌లను అక్రమంగా ఉపయోగిస్తూ కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలను సృష్టించి భక్తుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అనధికారిక లింకులను క్లిక్ చేయవద్దని, వాట్సాప్ సందేశాలను నమ్మి నగదు పంపవద్దని హెచ్చరించింది.
ఐటీ, సైబర్ క్రైమ్ రంగంలో కఠిన చర్యలు:
నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అరికట్టేందుకు టీటీడీ ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీసు విభాగాలతో కలిసి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే గత రెండేళ్ల కాలంలో సుమారు 259 నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి పూర్తిగా తొలగించడమే కాకుండా, బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసింది. టీటీడీ మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే వ్యక్తులు, సంస్థలపై కాపీరైట్, ట్రేడ్‌మార్క్, సైబర్ చట్టాల కింద కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
కేవలం అధికారిక మార్గాల ద్వారానే బుకింగ్స్:
శ్రీవారి భక్తులు ఎలాంటి మోసాలకు గురికాకుండా తమ దర్శనాలు, సేవలు, వసతిని కేవలం అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా ‘టీటీడీ డివోటీస్’ అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సైబర్ నేరగాళ్ల నకిలీ ఆఫర్ల పట్ల ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించి సురక్షితమైన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
