Visakha Railway Bridge Collapse: విశాఖలో ఘోరం.. ఒక్కసారిగా కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి.. ఏడుగురికి తీవ్ర గాయాలు
గత ఆరేళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రానున్న 6 నెలల్లో ఓపెనింగ్ చేసేలా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంతలో అనుకోకుండా ఈరోజు ప్రమాదం సంభవించింది.
- Naveen
- Published on- April 26, 2026 / 06:32 PM IST
Visakha Railway Bridge Collapse: విశాఖలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. తుంగలం దగ్గర రైల్వే బ్రిడ్జి పనులు చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజన సమయం కావడంతో తక్కువ మంది కార్మికులు ఉన్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.
గాజువాక నియోజకవర్గం 69వ వార్డు, తుంగలం గ్రామంలో కొన్నేళ్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మధ్యలో అనేకసార్లు పనులు ఆగిపోయాయి. అయితే, రానున్న 6 నెలల్లో ఓపెనింగ్ చేసేలా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంతలో అనుకోకుండా ఈరోజు ప్రమాదం సంభవించింది. మూడు, నాలుగు పిల్లర్ల మధ్య నిర్మాణం కూలిపోయింది.
ఆటో నగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న ఆర్వోబీ కుప్పకూలడం కలకలం రేపింది. గత ఆరేళ్లుగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర పాత బ్రిడ్జి ఇరుక్కుగా ఉంది. దీంతో స్థానికులు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అధికార యంత్రాంగం పూనుకుంది. కొన్ని రోజుల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభించారు. కాంక్రీట్ వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
