Vijayawada : విజయవాడలో కలకలం.. రూ.6.4 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

గోల్డ్ స్మగ్లింగ్ గుర్తు పట్టకుండా ఉండేందుకు బంగారంపై ఉన్న విదేశీ గుర్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. Vijayawada Customs Officials

Vijayawada Customs Officials (Photo : Google)

Vijayawada Customs Officials : విజయవాడలో కలకలం రేగింది. పెద్ద మొత్తంలో అక్రమ బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని విజయవాడ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ అధికారులు.. దుబాయ్, శ్రీలంక మూలాలకు చెందిన స్మగ్లింగ్ బంగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోకి తరలిస్తున్న కేసును ఛేదించారు.

శనివారం తెల్లవారుజామున బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నార్ నుండి విజయవాడకు కారులో తరలిస్తున్న స్మగ్లింగ్ బంగారం క్యారియర్‌ను అడ్డగించారు. దాదాపు 4.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ గుర్తు పట్టకుండా ఉండేందుకు బంగారంపై ఉన్న విదేశీ గుర్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. దీనికి కొనసాగింపుగా అధికారులు క్యారియర్‌లో సోదాలు నిర్వహించారు.

విదేశీ కరెన్సీ (కువైట్ దినార్ ఖతార్) తో పాటు 6.8 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962లోని నిబంధనల ప్రకారం స్మగ్లింగ్ చేసిన బంగారం క్యారియర్‌ను అరెస్టు చేశారు. ప్రత్యేక న్యాయమూర్తి 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి నిందితుడికి రిమాండ్ విధించారు. స్మగ్లింగ్ బంగారం వెనుక సిండికేట్‌లను గుర్తించడం చాలా కష్టమైన పని అంటున్నారు అధికారులు.

దేశంలోకి అక్రమంగా తరలించబడిన బంగారాన్ని తక్షణమే పాడు చేసి, విదేశీ గుర్తులను తొలగించి కరిగించేస్తారని తెలిపారు. ఇదంతా కూడా బంగారాన్ని అంతర్గత ప్రాంతాలకు తరలించడానికి ముందే చేస్తారని చెప్పారు. 2022-23, 2023-24 సంవత్సరాల్లో విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.40 కోట్ల విలువైన 70 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.