CM Jagan Visits Indrakeeladri : బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సీఎం జగన్.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టుచీరతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు.

CM Jagan Visits Indrakeeladri : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మూలా నక్షత్రం రోజున ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టుచీరతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

అంతకుముందు, దుర్గగుడిలో సీఎం జగన్ కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీఎం జగన్‌ దుర్గగుడి సందర్శన, పట్టువస్త్రాల సమర్పణ సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ముఖ్యమంత్రి చెప్పడంతో దర్శనాలు కొనసాగాయి. ఓవైపు సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తుండగా.. మరోవైపు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి దుర్గగుడికి వస్తే రెండు గంటల పాటు దర్శనాలను ఆపేసే వారు అధికారులు. ఈసారి మాత్రం సీఎం సూచనతో దర్శనాలకు బ్రేక్ పడకుండా చూశారు. ఆదివారం (అక్టోబర్ 2) మూల నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి లక్షల్లో భక్తులు తరలివచ్చారు.

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు కనకదుర్గమ్మ.. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బారులు తీరారు. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ ఒక్కరోజే అమ్మవారిని 2లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా.

మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తర్వాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మను దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యల్లో విజయం సాధిస్తారని నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. సరస్వతీదేవి దర్శనం.. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ట్రెండింగ్ వార్తలు