Vijayawada Mayor : హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్.. టీడీపీలో ఆసక్తికరంగా మేయర్ రేసు.. పెరిగిపోతున్న ఆశావహుల జాబితా
Vijayawada Mayor : అధికార టీడీపీలో విజయవాడ మేయర్ పదవి కోసం అప్పుడే పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది. ఎంపీ కోటాలో కొమ్మారెడ్డి పట్టాభి..ఎమ్మెల్యే కోటాలో బొండా సిద్ధార్థ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
- Harish Thanniru
- Updated on- September 6, 2026 / 11:02 AM IST
vijayawada mayor race in tdp
Vijayawada Mayor : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది. ఎన్నికలు ఎప్పుడు పెడుతారో.? మేయర్ సీటు రిజర్వేషన్ ఏంటో.? కూటమి పార్టీల్లో మేయర్ పీఠం దక్కేదెవరికో.? క్లారిటీ లేదు. అధికార టీడీపీలో మాత్రం మేయర్ పదవి కోసం అప్పుడే పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది. ఎంపీ కోటాలో కొమ్మారెడ్డి పట్టాభి..ఎమ్మెల్యే కోటాలో బొండా సిద్ధార్థ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
విజయవాడ మేయర్ పరిధి.. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉండటంతో..మూడు సెగ్మెంట్ల నుంచి పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించడంతో.. బెజవాడ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. కూటమిలో సీట్ల లెక్క తేలకముందే..విజయవాడ మేయర్ సీటును అటు బీజేపీ, ఇటు జనసేన ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నా..తెలుగు తమ్ముళ్లు మేయర్ అభ్యర్థిత్వంపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. ఆశావహులు తమ రాజకీయ పరిచయాలను ఉపయోగించుకుంటూ పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని ఆశీస్సులతో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మేయర్ రేసులో ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రెండు దశాబ్దాలకు పైగా పార్టీతో అనుబంధం.. టీడీపీ అధికార ప్రతినిధిగా గుర్తింపు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితుడనే ముద్ర. ఇవన్నీ పట్టాభికి ప్లస్ పాయింట్‌గా చెబుతోంది ఆయన వర్గం. గతంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసినప్పుడు పట్టాభి ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఆయన అనుచరులు పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా సిద్ధార్థ పేరు బలంగా వినిపిస్తోంది.
బొండా ఉమా తన రాజకీయ వారసుడి పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన టైమ్ అని భావిస్తున్నారట. విజయవాడ సిటీ పాలిటిక్స్‌లో కీలక నేతగా నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. యువనేతగా ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిద్ధార్థను ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ బరిలో దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారట బొండా ఉమా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో బొండా కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టు సిద్ధార్థకు కలిసి వస్తుందని ఆయన వర్గం అంచనా వేస్తోందట. అయితే ఎంపీ కేశినేని చిన్ని ఎటువైపు నిలుస్తారు.? పట్టాభికి మద్దతిస్తారా? లేక బొండా సిద్ధార్థ అభ్యర్థిత్వానికి అంగీకరిస్తారా.? అన్నదే ఇప్పుడు బెజవాడ టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
పట్టాభి, సిద్ధార్థతో పాటు..విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల నుంచి పలువురు సీనియర్ లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు మేయర్ పీఠంపై కన్నేసి పెట్టారట. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో పాటు దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మహిళలకు మేయర్ పదవి రిజర్వ్ అయితే పోటీ మరింత పెరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసారి కూటమి సమీకరణాలు కూడా కీలకం కానున్నాయి. టీడీపీతో పాటు జనసేన, బీజేపీకి ఎన్ని డివిజన్లు కేటాయిస్తారు.? విజయవాడ మేయర్ పదవిపై భాగస్వామ్య పక్షాల వైఖరి ఏంటి.? క్యాస్ట్ ఈక్వేషన్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారు.? సీనియర్లకు అధిష్టానం ఎంత ప్రాధాన్యం ఇస్తుంది? అనే అంశాలే అభ్యర్థి ఎంపికలో కీలకంగా మారనున్నాయి.
అయితే ఎన్నికల ప్రకటన రాకముందే ఆశావహుల జాబితా పెరిగిపోతూ వస్తోంది. రిజర్వేషన్ తేలకముందే మేయర్ పీఠంపై లెక్కలు మొదలయ్యాయి. ఎంపీ కోటాలో పట్టాభి… ఎమ్మెల్యే కోటాలో బొండా సిద్ధార్థ..మధ్యలో సీనియర్లు, మహిళా నేతలు, కూటమి సమీకరణాలు… ఇలా విజయవాడ మేయర్ రేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చివరకు అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో..అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.
