Visakha Fishermens Missing : సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు.. ఐదుగురి ఆచూకీ లభ్యం.. మరో ఇద్దరికోసం కొనసాగుతున్న గాలింపు

Visakha Fishermen Missing Rescue Operation : విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఐదుగురిని రక్షించగా.. మరో ఇద్దరు ఆచూకీ లభించలేదు.

Visakha Fishermens Missing

Visakha Fishermen Missing Rescue Operation : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో విశాఖ చేపల రేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతుకావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, వీరిలో ఐదుగురు ఆచూకీ లభ్యంగా మరో ఇద్దరి ఆచూకీ కోసం నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : Union Cabinet expansion : కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఉప ప్రధానిగా అమిత్ షా? టార్గెట్ ఫిక్స్..!

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కారె చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్య పాలేనికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఈనెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా వారికి సమాచారం అందించారు. దీంతో జాలర్లు జులై 4వ తేదీ మధ్యాహ్నానికి ఒడ్డుకు చేరుకుంటామని బదులిచ్చారు. కానీ, శనివారం సాయంత్రం వరకు వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్లు చేసినా ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

దీంతో ఆదివారం ఉదయం ఫిషరీస్ కార్యాలయం ముందు మత్స్యకారులు బైఠాయించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రజాప్రతినిధి తమ వద్దకు రాలేదని ఆరోపిస్తూ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. మత్స్యకారులు గల్లంతు ఘటనపై విజయనగరం, విశాఖ కలెక్టర్లు రామ్ సుందర్ రెడ్డి, అభిషిక్త్ కిషోర్‌లతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. మత్స్యకారులను రక్షించేందుకు చేపట్టిన చర్యలను కలెక్టర్లు మంత్రికి వివరించారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల నాయకుడితో ఫోన్లో మాట్లాడినట్లు కలెక్టర్లు వివరించారు. ఏడుగురు మత్స్య‌కారుల్లో ఆరుగురికి లైఫ్ జాకెట్లు ఉన్నాయ‌ని, ఒక‌రికి లైఫ్ జాకెట్ లేన‌ట్టు తెలిపారని క‌లెక్ట‌ర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు.

మత్స్యకారుల గల్లంతు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాలింపు సందర్భంగా బోటు యాజమాని కారె చిన్నయ్యను వాణిజ్య నౌక సిబ్బంది కాపాడారు. సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే, మిగిలిన ఆరుగురు మత్స్యకారులకోసం సముద్రంలో విస్తృతంగా గాలింపు కొనసాగించారు. అయితే, వాణిజ్య నౌక ఎక్కలేకపోయిన నలుగురి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఆచూకీ లభించని మరో ఇద్దరు మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మత్స్యకారుల గల్లంతు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేశామని సీఎంకు అధికారులు వివరించారు. అయితే, కోస్టుగార్డు నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని, గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖ సీపీలకు సీఎం చంద్రబాబు సూచించారు.