Janasena On Raghava Rao : ప్రేమిస్తున్నాను అంటూ విశాఖలో ఓ బాలికను వేధింపులకు గురి చేసిన రాఘవరావుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన స్పష్టం చేసింది. రాఘవరావుకి జనసేన పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవంది. అసలు క్రియాశీలక సభ్యత్వమే లేదని తేల్చి చెప్పింది. నేరపూరిత చర్యల్లో ఉన్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోన తాతారావు కోరారు.
పార్టీ ముఖ్యులతో ఎందరో ఫోటోలు తీయించుకున్న మాత్రాన వారు తమ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్లు కాదని చెప్పారు. రాఘవరావు కొద్దిరోజుల ముందు వరకు వైసీపీలో ఉన్నారని చెప్పారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
రాఘవరావు తన మనవరాలి వయసున్న ఓ బాలికపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. నిన్న ఏకంగా బాలిక ప్లాట్ కే వెళ్లిన రాఘవరావు హల్ చల్ చేశాడు. ఏకంగా కత్తి తీసుకుని వెళ్లాడు. మద్యం మత్తులో జేబులో కత్తి పెట్టుకుని బాలిక ప్లాట్ ముందు కొద్దిసేపు రచ్చ చేశాడు. తన భార్యకు విడాకులు ఇస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. బాధితుల విజువల్స్ రికార్డ్ చేయడంతో రాఘవరావు దుర్మార్గం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
రాఘవరావు కొంతకాలంగా ఒక బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ తన పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెడుతున్నాడు. నిన్న ఫుల్లుగా మద్యం సేవించి కత్తి పట్టుకుని ఆ అమ్మాయి ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లాడు. తనను ప్రేమించకపోతే కత్తితో నరికి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా అవసరమైతే నీ కోసం నా భార్యను కూడా వదులుకునేందుకు సిద్ధం అంటూ అమ్మాయి రూమ్ దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేశాడు.
ఆ అమ్మాయి స్నేహితులు రాఘవరావును అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా వారిని కూడా రాఘవరావు బండబూతులు తిట్టాడు. మీ మనవరాలి వయసున్న అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించటం కరెక్ట్ కాదని వాళ్లంతా బతిమిలాడుతుంటే.. నేను జనసేన రాష్ట్ర నాయకుడిని అని, నాకు పవన్ కళ్యాణ్ తెలుసు, నేను తలచుకుంటే ఏమైనా చేస్తాను అంటూ అతను బెదిరింపులకు దిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
రాఘరవావు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై వైసీపీ నాయకులు జనసేనను టార్గెట్ చేశారు. ఇలాంటి వ్యక్తులను పవన్ కల్యాణ్ పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని వైసీపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు.