visakhapatnam tdp: గత ఎన్నికాల్లో వైసీపీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ విశాఖ నగర పరిధిలో టీడీపీ కొంత మేరకు సత్తా చాటింది. నాలుగు దిక్కులు నాలుగు స్తంభాల్లా నలుగురు అభ్యర్థులు గెలిచారు. దక్షిణం నుంచి వాసుపల్లి గణేశ్, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, పశ్చిమం నుంచి గణబాబు, తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత పార్టీ ఓటమిపై చంద్రబాబు సమీక్షలు మొదలుపెట్టడం.. మేయర్ పీఠం ఎలాగైనా గెలుచుకోవాలని చెప్పడం.. కొద్ది కాలానికి సీఎం జగన్ మూడు రాజధానుల ఆంశం తెర మీదకు తేవడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.
ఒక్కొక్కరు సైకిల్ దిగారు:
ఒకవైపు టీడీపీ అధిష్టానం అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పోరాడుతుంటే మరోవైపు ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు విశాఖను పాలనా రాజధానిగా చేసే నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. కొన్ని సమస్యలపై అధిష్టానం స్పందించకపోవడంతో ఒక్కొక్కరు సైకిల్ దిగి ఫ్యాన్ స్విచ్ వేయడం మెుదలు పెట్టారు.
ఇందులో మెుదటిగా పార్టీ విశాఖ రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు ఫ్యాన్ గూటికి చేరిపోయారు. అదే బాటలో వాసుపల్లి గణేశ్ కూడా వెళ్లిపోయారు. మరోపక్క, గంటా శ్రీనివాసరావు, గణబాబు కూడా రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ పట్టు తప్పిపోకుండా ఉండేలా అందరినీ కలుపుకొనిపోయే నాయకుడిని అన్వేషించే పనిలో అధిష్టానం ఉందంటున్నారు.
కమిటీలు నియమించనున్న టీడీపీ:
పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కమిటీలు నియమించనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యుదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఉంటారు. కమిటీల సమన్వయం కోసం జిల్లాలో ముఖ్య నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తారట. సమన్వయ కమిటీలో జిల్లా కమిటీలో ఉన్నన్ని పదవులు ఉండవని అంటున్నారు.
విశాఖ, అనకాపల్లి, అరకు లోయ పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ కమిటీలు:
విశాఖ జిల్లాలో ఇప్పటి వరకూ అర్బన్, రూరల్ జిల్లా కమిటీలుండేవి. ప్రస్తుతం అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్ష పదవులు ఖాళీగానే ఉన్నాయి. కొత్త విధానంలో విశాఖ, అనకాపల్లి, అరకు లోయ పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధ్యక్షులు ఎవరనేది ఇంతవరకు ఖరారు కాలేదు. కొన్ని పేర్లు అధినేత వద్ద ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖకు ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్లకు అవకాశం కల్పించవచ్చునని ప్రచారం జరుగుతోంది. గతంలో అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చిన అధిష్ఠానం, ఈసారి అలాంటి ప్రయోగం చేయకపోవచ్చునని చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం గాలం వేసిన వ్యక్తికి పదవి:
ఒకవేళ పాత విధానం అమలు చేస్తే జిల్లా అధ్యక్షుడు పదవులు వెలగపూడి రామకృష్ణ బాబు లేదా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అవకాశం కల్పించవచ్చునని అంచనా వేస్తున్నారు. అర్బన్ పదవి కోసం ద్వితీయ శ్రేణి నాయకులు పోటీ పడుతున్నారట. వైసీపీ ప్రభుత్వం పల్లా శ్రీనివాసరావుకు ఇప్పటికే గాలం వేసిందట. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి పల్లాకే కట్టబెట్టాలని అధిష్టానం భావిస్తుందట. ఆయన వద్దంటే మిగిలిన వారిలో ఒకరి పేరు అధినేత ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు.
పీలా గోవింద్‌కు బాధ్యతలు:
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు అప్పగించే అవకాశం ఉందట. పంచకర్ల రమేశ్ బాబు రూరల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత గోవింద్‌కు ఇవ్వాలని అధినేత నిర్ణయించారట. ఈ రేసులో గతంలో రూరల్ అధ్యక్షుడిగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కూడా ఉన్నారని చెబుతన్నారు.
ఇక, అరకు లోయ పార్లమెంటరీ నియోజకవర్గం నాలుగు జిల్లాలకు విస్తరించి ఉంది. ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జులు, జిల్లాల నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ ప్లాన్లు తిప్పికొట్టగలగే నాయకులను ఇప్పుడు పార్టీ గుర్తిస్తుందని కేడర్ ఆశగా ఎదురు చూస్తోంది.