దొరకని చింతమనేని : 12 పోలీసు బృందాలు గాలింపు

  • Publish Date - September 7, 2019 / 10:05 AM IST

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎక్కడ ? ఆయన్ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. ముమ్మరంగా ఆయా జిల్లాల్లో  సోదాలు చేస్తున్నారు. మొత్తం 12 బృందాలు ఆయన జాడ కనుక్కొనేందుకు జల్లెడ పడుతున్నాయి. అయినా..9 రోజులుగా ఆయన ఆచూకీ తెలియడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగి..చింతమనేనిపై నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నారు.

గత 20 ఏళ్లలో ఆయనపై 50 కేసులున్నాయని..ఎందుకు విచారించలేదనే దానిపై ఎస్పీ నవదీప్ సింగ్ ఆరా తీస్తున్నారు. చింతమనేని జాడ చిక్కకపోవడంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడుతోంది. ఎస్ఐ కాంతిప్రియ, సీఐ మూర్తిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

దళితులను దూషించి, దౌర్జన్యం చేసిన కేసులో చింతమనేనిపై పలు సెక్షన్ల కింద కేసులు రిజిష్టర్ అయ్యాయి. కానీ పోలీసులు చర్యలు తీసుకొనే మునుపే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆచూకీ దొరకగానే అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. దళితులపైనే కాకుండా ప్రభుత్వాధికారులపైనా చింతమనేని చేసిన దౌర్జన్యాలను లెక్క తేలుస్తున్నారు. పక్కా ఆధారాలు సంపాదిస్తున్నారు.

ప్రస్తుతం వాటిని తిరగదోడేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరిట దూషించి దాడికి ప్రయత్నించారని కొందరు స్థానికులు కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని అజ్ఞాతం ఎప్పుడు వీడుతారో చూడాలి. 
Read More : సినిమా ప్రపంచం నుంచి పవన్ బయటకు రావాలి – మంత్రి బోత్స