సమరానికి సై : ఈసారి సంక్రాంతి విన్నర్ ఏ ”జాతి కోడి”

పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా.. పుంజులు బరుల్లోకి దిగడం కాయమే అంటున్నారు పందెంరాయుళ్లు. కోనసీమ గ్రామాల్లో భారీగా బరులు రెడీ చేశారు. మెట్టతోక కోడి మెరుస్తుందని

  • Publish Date - January 13, 2020 / 04:04 PM IST

పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా.. పుంజులు బరుల్లోకి దిగడం కాయమే అంటున్నారు పందెంరాయుళ్లు. కోనసీమ గ్రామాల్లో భారీగా బరులు రెడీ చేశారు. మెట్టతోక కోడి మెరుస్తుందని

పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నా.. పుంజులు బరుల్లోకి దిగడం కాయమే అంటున్నారు పందెంరాయుళ్లు. కోనసీమ గ్రామాల్లో భారీగా బరులు రెడీ చేశారు. మెట్టతోక కోడి మెరుస్తుందని కొంతమంది.. లేదు లేదు నెమలి కోడి నెగ్గుతుందని మరికొందరు అప్పుడే సవాళ్లు విసురుకుంటున్నారు. గోదారి గ్రామాల్లో ఇప్పుడెక్కడ చూసినా కాక్‌ ఫైట్‌ కబుర్లే. 

తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగలో స్పెషల్ ఎట్రాక్షన్ కోడి పందాలు. ఈ టైమ్‌లో కాక్‌ ఫైట్‌ ఆడని వ్యక్తులు… నిర్వహించని గ్రామాలు ఉండవు. ఫెస్టివల్‌ కోసం విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్లంతా ఒక్క దగ్గరికి చేరుకుంటారు. మూడు రోజుల పాటు అనేక కార్యక్రమాలతో పాటు కోడి పందాలను ఎంజాయ్ చేస్తుంటారు. బరుల్లో తలపడే కోళ్లను చూడడమే కాదు వాటిపై పందాలు కూడా కాస్తుంటారు. పెద్ద సంఖ్యలో వచ్చే జనంతో బరులు జాతరను తలపిస్తాయి.

బహిరంగ జూదాలపై కోర్టు నిషేదాఙ్ఞలున్నా.. పోలీసు ఆంక్షలున్నా.. సంప్రదాయం పేరుతో ఈ కోడి పందాలు ప్రతి ఏటా కొనసాగుతూనే ఉన్నాయి. కోనసీమ ప్రాంతంలో మినీ స్టేడియంను తలపించే విధంగా పందెం బరులను తీర్చిదిద్దుతున్నారు. ప్రో కబడ్డీ స్టయిల్‌లో చుట్టూరా ప్లడ్ లైట్లు, సీసీ కెమెరాలను అమర్చుతున్నారు. పందెం రాయుళ్లను రంజింప చేసేందుకు కోళ్లు చేసే స్టంట్లను రీ ప్లే చేసి మరీ చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పందాలను చూసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులకు గ్రాండ్ గా వెల్‌కమ్‌ పలికేలా సెట్టింగ్‌లు వేస్తున్నారు.

కోనసీమ ప్రాంతంలోని అల్లవరం, అమలాపురం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, మురుముళ్ల, రావుపాలెం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, కాకినాడ పరిసర ప్రాంతాలు, కరప మండలాల్లో భారీగా పందెం బరులను సిద్దం చేస్తున్నారు. పందెం రాయుళ్లలో హుషారు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కోడి పందాలతోపాటు గుండాట, పేకాటల నిర్వహణకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. పందాలు ఆడేవారికి, వాటిని చూసేందుకు వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బరులను సిద్ధం చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ స్థలాలకు వందలాది ఎకరాలను చదును చేస్తున్నారు.

పందెం కోళ్లలో చాలా రకాలున్నాయి. కోడిపై ఉన్న వెంట్రుకల రంగును బట్టి నామకరణం చేస్తారు. తల కింద దవడ భాగం, నడుమ భాగంలో ఉన్న ఈకల రంగు.. వెనుక భాగంలో ఉన్న వెంట్రుకల రంగు బట్టి కూడా కోళ్ల రకాలను చెబుతుంటారు. కాళ్ళ గోళ్ళు ఆధారంగా వాటి వయసును నిర్ధారిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాధారణంగా పెంచే పందెం కోళ్ళలో కాకి, పచ్చకాకి, డేగ, నెమలి, కాకి డేగ, సేతువ, జీడిపిక్క సేతువ, పర్ల, కాకిడేగ పర్ల, సవళ, గౌడ సవళ, కాకి సవళ, మైల, ఎరుపు మైల, పింగళ, రసింగ, మెట్ట తోక లాంటి రకాలున్నాయి. వీటిలో మెట్టతోక కోడికి ఖరీదు ఎక్కువ. 50వేల నుంచి లక్షా యాభై వేల ధర ఉంటుంది. మిగతా పుంజులకు తోక కిందివైపు ఉంటే దీనికి మాత్రం పైకి ఉంటుంది. 

పుంజులను పెంచడం, వాటిని పందాలకు సిద్ధం చేయడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. పందెం కోడి పెంపకానికి నెలకు పదివేల రూపాయల దాకా ఖర్చవుతుంది. ఇలా పెంచిన కోడికి ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. ఈ కోళ్ల కోసం మూడు నెలల ముందే.. అడ్వాన్స్‌లు ఇస్తారంటే.. వీటికున్న డిమాండ్‌ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

Also Read : 2 రోజులకోసారి మటన్ కీమా.. 20రకాల డ్రై ఫ్రూట్స్ : పందెంకోళ్ల ఫుడ్ మెనూ