ఏపీలో టెన్షన్.. టెన్షన్..! ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితంపైనే చర్చ!

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు? అంటూ లెక్కలు కట్టి మరీ బెట్టింగ్ లు కాసేందుకు సిద్ధమైపోతున్నారు.

Ap Election Results 2024 : అటెన్షన్ ఏపీ.. ఎన్నికల్లో చివరి ఘట్టం కౌంటింగ్ పై నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే ప్రజాతీర్పు బ్యాలెట్ బాక్సులను దాటుకుని బయటకు రానుంది. అభ్యర్థులు పార్టీ నేతల్లో మాత్రమే కాదు సాధారణ ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఏ పార్టీ పీఠం ఎక్కబోతోంది? ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబోతోంది? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓవైపు రేపటి కౌంటింగ్ కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీసులు భద్రతపై దృష్టి పెట్టారు. ఇటు బెట్టింగ్ రాయుళ్లు సైతం సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. రౌండ్ రౌండ్ కి బెట్టింగ్ కాసేందుకు సై అంటున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు అంటూ? లెక్కలు కట్టి మరీ బెట్టింగ్ లు కాసేందుకు సిద్ధమైపోతున్నారు.

ఏపీలో అయితే సంక్రాంతి ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఉద్యోగులు రేపటి కౌంటింగ్ కోసం సెలవులు పెట్టేస్తున్నారు. జిల్లాల్లో ఉన్న నేతలు, మంచి హోదాలో ఉన్న వ్యాపారులు హోటళ్లలో బుక్ చేసుకుంటున్నారు. కౌంటింగ్ ను లైవ్ లో చూసేందుకు స్క్రీన్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ లను యూత్ ఎలా ఎంజాయ్ చేస్తారో అలా నాయకులంతా మందు పార్టీలను ముందే ప్రిపేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో ఓ పండుగ వాతావరణం కనిపిస్తోంది.

Also Read : ఆంధ్రప్రదేశ్‌లో గెలుపెవరది..? ఎగ్జిట్‌పోల్స్ తర్వాత స్పష్టత వస్తుందనుకుంటే మరింత గందరగోళం!

భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉంటే జనం ఎలా ఊగిపోతారో అదే రేంజ్ లో ఏపీ ప్రజలు, నాయకులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి తమదే అధికారం అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో అన్ని వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. మహిళా ఓటర్లు, యువ ఓటర్లు ఎవరికి జై కొట్టారో? అని అభ్యర్థులు తేల్చుకోలేకపోతున్నారు. ఇటు బెట్టింగ్ రాయుళ్లు కూడా కాయ్ రాజా కాయ్ అంటూ రెడీ అయిపోయారు. తమ అభిమాన నాయకుడే గెలుస్తాడని కొందరు, లేదు లేదు తమ అభిమాన నేతకే జనం పట్టం కడతారని మరికొందరు పందేలకు దిగుతున్నారు. ఏ నేత ఎవరితో కలిశారు? అదెలా లాభం చేకూరుతుందో? ఎవరికి వారే విశ్లేషణలు కూడా చేసుకుంటున్నారు.