చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ఎందుకు స్పందించరు: వైఎస్ షర్మిల

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నీట్, యూజీసీ పరీక్షల అవకతవకలపై ఎందుకు స్పందించలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila on NEET UG 2024 Row: నీట్, యూజీసీ 2024 పరీక్షల్లో జరిగిన అవినితి, అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలపై బీజేపీని టీడీపీ, వైసీపీ ప్రశ్నించలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ విషయంలో కూడా ఈ రెండు పార్టీలు స్పందించలేదని.. బీజేపీ తొత్తు పార్టీలని నిరూపించుకుంటున్నాయని దుయ్యబట్టారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాలతో ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”డాక్టర్లు అవుదామని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోంది. NTA ప్రతిష్టను దిగజార్చేలా నీట్ పేపర్ లీక్ స్కాం జరిగిందనే ఆధారాలు బయటపడ్డాయి. అయినా కానీ విద్యార్థులు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. పరీక్షకు ఆలస్యంగా వస్తే గ్రేస్ మార్కులు ఎలా ఇస్తారు.. రెండు నిమిషాలు అదనపు సమయం ఇవ్వొచ్చు. గత రెండు సంవత్సరాల్లో ఒక్కరికో ఇద్దరికో టాప్ మార్కులు వచ్చేవి. కానీ ఈ సంవత్సరం పేపర్ లీక్ వల్ల 60 మందికి టాప్ మార్కులు వచ్చాయి.

Also Read : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

3 లక్షల మంది పరీక్ష రాశారు కాబట్టే 60 మంది టాప్ వచ్చారని NTA చెప్పడం హాస్యాస్పదం. NTA ఫలితాలు కావాలనే ఎన్నికల సమయంలో విడుదల చేశారు. ఇన్ని అవకతవకలు జరిగినా ఇంతవరకు NTA మీద చర్యలు తీసుకోలేదు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయింది. ప్రధాని మోదీ జపం చేసేందుకే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది పేపర్ లీక్‌పై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి.. NTAని ప్రక్షాళన చేయాలి. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలల”ని షర్మిల డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు