మూడు రాజధానులు అంశంపై చంద్రబాబు ఎందుకు రచ్చ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును గబ్బిలంతో పోల్చిన ఆయన రాజధాని ప్రాంతంలో చంద్రబాబు క్యాపిటలిస్ట్ ఉద్యమం నడిపిస్తున్నారని విమర్శించారు. ఒక రాజకీయ గబ్బిలంలా మారిన చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గబ్బిలంలో ఉండే లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయని అన్నారు.
గబ్బిలం పాలిచ్చే పశువుల వద్దకు వెళ్లి తాను కూడా పాలు ఇస్తాను కాబట్టి నేను మీ జాతే అని చెప్పుకుంటుందని, అలాగే పక్షుల వద్దకు వెళ్లి నేను మీలాగే గాల్లో ఎగరగలను కాబట్టి నేను కూడా పక్షిజాతి ప్రాణినే అని చెప్పుకుంటుందని, తీరా చూస్తే గబ్బిలం తిరిగేది స్మశానాల్లో, ఉండేది దయ్యాలు వేలాడే మర్రిచెట్లలో అని, చంద్రబాబు కూడా అలాగే ప్రవర్తిస్తారని అన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఒక గబ్బిలంలా రాష్ట్రంలో తిరుగుతూ ఏ ప్రాంతానికి చెందని గబ్బిలంలా తయారయ్యారని విమర్శలు చేశారు.
చంద్రబాబు అనే గబ్బిలం అమరావతి ఉద్యమం కోసం శవాల వేటలో ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అమరావతి క్యాపిటలిస్ట్ ఉద్యమం కోసం అవసరమైతే మనుషులను చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు సిద్ధపడుతారనే సమాచారం మా దగ్గర ఉందని అన్నారు. ఇంతకుముందు మల్లెల బాబ్జీని కూడా ఇలాగే చంపేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందని అన్నారు.