YS Jagan : వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.. చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్.. అధికారం శాశ్వతం కాదంటూ హెచ్చరిక
YS Jagan Comments On MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేయడంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు.
- Harish Thanniru
- Published on- August 2, 2026 / 08:32 PM IST
YS Jagan sensational comments on MLA Virupakshi Arrest
YS Jagan Comments On MLA Virupakshi Arrest : కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని చిప్పగిరి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు 14రోజులు రిమాండ్ విధించారు. ఎమ్మెల్యేతోపాటు 16మందికి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, విరూపాక్షి అరెస్టుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడుపై ట్విటర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం.. దాడి చేసినవారికి రక్షణ.. బాధితులపై కేసులతో రాజకీయ కక్ష అంటూ తీవ్ర స్థాయిలో కూటమి పాలనపై జగన్ విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, చట్టపాలన ప్రమాదంలో పడిందని జగన్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడితే వారికి రక్షణ కల్పిస్తూ, బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులపైనా కేసులు పెడుతున్నారని, ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై అర్ధరాత్రి పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంటిపై రాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేసి, తలుపులు బద్దలుకొట్టి విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
చిప్పగిరి మండలం నేమకళ్లులో వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, ప్రాణభయంతో ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షిని ఆశ్రయించగా, బాధిత కుటుంబానికి అండగా వెళ్లిన ఎమ్మెల్యేపైనే రాళ్ల దాడి జరిగిందని జగన్ ఆరోపించారు. ఈ ఘటనలో విరూపాక్షి సోదరుడు శ్రీరాముడు గాయపడినప్పటికీ, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యేపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై కూడా జగన్ ప్రశ్నలు లేవనెత్తారు. అర్ధరాత్రి పోలీసులు చేసిన చర్యలకు సంబంధించిన ఆధారాలు బయటకు రాకుండా చేయడానికే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారని ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై రాజకీయ కక్షతో హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారని జగన్ అన్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని, ఆ స్పందనను చూసి ప్రభుత్వం భయపడి వీడియోలను వక్రీకరించి పలువురు నాయకులపై తీవ్రమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసిందని జగన్ అన్నారు. గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపై కూడా రాజకీయ కక్షసాధింపుతో కేసులు నమోదు చేశారని జగన్ పేర్కొన్నారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తి విషయంలోనే కిడ్నాప్ కేసు నమోదు చేయడం అన్యాయమని విమర్శించారు.
డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని, నిరుద్యోగ భృతి హామీని ఎందుకు అమలు చేయడం లేదని యువత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందని జగన్ అన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు, అర్ధరాత్రి అరెస్టులకు ప్రభుత్వం పాల్పడుతోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదు.. అక్రమ కేసులు, అరెస్టులతో వైఎస్సార్‌సీపీని భయపెట్టలేరని జగన్ స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బాధితులకు అండగా నిలుస్తామని, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోరాటం కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు.
